ETV Bharat / bharat

సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతల భేటీ

author img

By

Published : Dec 6, 2020, 9:57 AM IST

Updated : Dec 6, 2020, 12:30 PM IST

farmers protest
11వ రోజుకు రైతుల ఆందోళనలు

12:27 December 06

భారత్​ బంద్​కు కాంగ్రెస్​ మద్దతు

సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటం వల్ల ఈనెల 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో బంద్​కు విపక్ష, భాజపా భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్​ కూడా భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించింది.  

" డిసెంబర్​ 8న జరగబోయే భారత్​ బంద్​కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ కార్యాలయాల్లో ఆందోళనలు చేపడతాం. ఇది రైతుల పట్ల రాహుల్​ గాంధీ మద్దతును మరింత బలోపేతం చేస్తుంది. దేశవ్యాప్త బంద్​ విజయవంతమవుతుందని భరోసా ఇస్తున్నాం."  

      -  పవన్​ ఖేరా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి  

రైతులు చేస్తోన్న ఆందోళనలకు మొదటి నుంచే మద్దతుగా నిలుస్తున్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, ట్విట్టర్​తో పాటు బహిరంగంగానూ కేంద్రంపై విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రైతుల సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్రానికి హెచ్చరికలు పంపారు. 

12:06 December 06

'విపక్ష పాలిత రాష్ట్రాల్లో రైతులను రెచ్చకొడుతున్నారు'

దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్​ చౌదరి. 'పంటలకు కనీస మద్దతు ధర కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. దానిని రాతపూర్వకంగా కూడా ఇస్తామన్నాం. కాంగ్రెస్​, విపక్ష పాలిత రాష్ట్రాల్లో రైతులను రెచ్చకొడుతున్నారనుకుంటున్నా. దేశంలోని రైతులు కొత్త చట్టాలతో సానుకూలంగానే ఉన్నారు. కానీ, కొందరు రాజకీయ నేతలు ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, రైతులపై పూర్తి నమ్మకం ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగేలా రైతులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని భావిస్తున్నా. కొత్త చట్టాలు రైతులకు స్వేచ్ఛను ఇస్తాయి. నిజమైన రైతులు ఈ చట్టాల గురించి ఆందోళన చెందరు." అని పేర్కొన్నారు మంత్రి.    

ఆందోళనలు ఏ విధంగా రాజకీయంగా మారుతున్నాయో రైతులు ఆలోచించాలని సూచించారు కేంద్ర మంత్రి. రాజకీయంగా లబ్ధిపొందాలనే వారి మాటలకు ఆకర్షితులు కావొద్దని కోరారు. 

11:52 December 06

సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతల భేటీ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 11వ రోజూ కొనసాగిస్తున్నారు రైతులు. కేంద్రంతో 5వ విడత చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఈనెల 9న మరో దఫా చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. ఈ క్రమంలో దిల్లీలోని సింఘు సరిహద్దు (హరియాణా-దిల్లీ సరిహద్దు)లో సమావేశమయ్యారు రైతు సంఘాల ప్రతినిధులు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

09:37 December 06

11వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక రహదారులపై బైఠాయించి..  11వ రోజు ధర్నా కొనసాగిస్తున్నారు కర్షకులు. అన్నదాతల ఉద్యమానికి మద్దతుగా దిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు వివిధ ప్రాంతాల రైతులు. కేంద్రం, రైతు సంఘాల మధ్య శనివారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ప్రతిష్ఠంభన తొలగలేదు. ఈ నెల 9న మరోసారి భేటీకావాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమం వాయిదా వేయాలని కోరింది ప్రభుత్వం. కుదరదని చెప్పిన రైతు సంఘాల నేతలు.. బంద్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

Last Updated : Dec 6, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.