ETV Bharat / bharat

'అసోం భాజపా సీఎం అభ్యర్థిగా మాజీ సీజేఐ జస్టిస్​ గొగొయి'

author img

By

Published : Aug 24, 2020, 5:35 AM IST

Updated : Aug 24, 2020, 8:37 AM IST

మాజీ సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయి.. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారని పేర్కొన్నారు మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత తరుణ్​ గొగొయి. సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. అయితే మాజీ సీఎం వ్యాఖ్యలను ఖండించింది భాజపా. అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

Ex-CJI Ranjan Gogoi may be BJP's CM candidate in Assam
అసోం భాజపా సీఎం అభ్యర్థిగా మాజీ సీజేఐ!

అసోంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుంచే రాజకీయంగా వేడి రాజుకుంటోంది. అధికార భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్​. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్​ రంజన్​ గొగొయి పోటీ చేస్తారని పేర్కొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత తరుణ్​ గొగొయి. ఈ విషయంపై తనకు సమాచారం ఉన్నట్లు తెలిపారు.

"ముఖ్యమంత్రి పదవికి భాజపా అభ్యర్థుల జాబితాలో సీజేఐ రంజన్​ గొగొయి పేరు ఉన్నట్లు తెలిసింది. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని నేను అనుమానిస్తున్నా. జస్టిస్​ రంజన్​ గొగొయి.. మానవ హక్కుల కమిషన్​ లేదా ఇతర కమిషన్లకు సులభంగా ఛైర్మన్​ అయి ఉండేవారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరికతోనే రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించారు. అయోధ్య కేసు తీర్పులో జస్టిస్​ రంజన్​ గొగొయి ఉండటం వల్ల భాజపా సంతోషపడింది. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని జస్టిస్​ గొగొయి అంగీకరించినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు."

- తరుణ్​ గొగొయి, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఖండించిన భాజపా..

అసోం సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ సీనియర్​ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించింది భాజపా. అందులో వాస్తవం లేదని స్పష్టం తేల్చిచెప్పింది. వయస్సు పైబడినవారు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్​ కుమార్​ దాస్​. తన జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులను చూశానని, కానీ తరుణ్​ గొగొయి వంటి చౌకబారు వ్యాఖ్యలు చేసే వారిని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిని నేను కాదు..

అసోం ఎన్నికల్లో పోటీ చేస్తానని.. కానీ, కాంగ్రెస్​ ముఖ్యమంత్రి అభ్యర్థిని తాను కాదని వెల్లడించారు తరుణ్​ గొగొయి. సీఎం పదవికి పలువురు అర్హత కలిగిన నేతలు ఉన్నారని.. తాను కేవలం మార్గదర్శకుడిగానే ఉంటానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​, ఏఐయూడీఎఫ్​, లెఫ్ట్​ పార్టీలు సహా ఇతర చిన్న పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా!

Last Updated :Aug 24, 2020, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.