ETV Bharat / bharat

ఒక్కరోజు మరణాల్లో 'మహా'ను మించిన దేశ రాజధాని

author img

By

Published : Jun 14, 2020, 5:30 AM IST

Updated : Jun 14, 2020, 6:18 AM IST

దిల్లీలో 24 గంటల్లో 129 మంది వైరస్​కు బలయ్యారు. దేశంలో ఒక్కరోజులో 11,458 మందికి వైరస్‌ సోకింది. పది రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరింది. అక్కడ మరణాలు పెరుగుతున్న కారణంగా తాజా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

delhi
దిల్లీలో మృత్యుకేళి

దిల్లీలో మృత్యుకేళి దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 11,458 కేసులు నమోదయ్యాయి. రాజధాని దిల్లీని మహమ్మారి వణికిస్తోంది. రోజువారీ మరణాల్లో దిల్లీ మహారాష్ట్రను దాటిపోయింది. శుక్ర-శనివారాల్లోని గత 24 గంటల్లో మహారాష్ట్రలో 127 మరణాలు సంభవించగా దిల్లీలో 129 నమోదయ్యాయి.

ఈ విషయంలో మరో రాష్ట్రం మహారాష్ట్రను దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 1 నుంచి మహారాష్ట్రలో మరణాలు 62% పెరగ్గా, దిల్లీలో 156% పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 17 రాష్ట్రాల్లో 386 మరణాలు సంభవించగా అందులో 66% ఈ రెండు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడుల్లోనూ రోజువారీ మరణాలు అధికమవుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో కేసులు 1.01 లక్షలకు చేరాయి. ఈ అంశంలో ఆ రాష్ట్రాన్ని ఒక దేశంగా పరిగణిస్తే ప్రపంచంలో 17వ స్థానంలో నిలుస్తుంది. మహారాష్ట్రలో రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా నమోదు కాగా, దిల్లీలో తొలిసారి రెండు వేల మార్కు దాటింది.

కేసుల వృద్ధిరేటులో తగ్గుదల

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నా, రోజువారీ వృద్ధిరేటు క్రమంగా తగ్గుతోంది. లాక్‌డౌన్‌ చివరి వారంలో సగటున 4.72% మేర కేసులు పెరగ్గా, ఈ నెల తొలి వారానికల్లా అది 4.42%కి తగ్గింది. రెండో వారంలో 3.82%కి చేరింది. మొత్తం కేసులు రెట్టింపయ్యే (డబ్లింగ్‌) రేటు 18 రోజులకు పెరగ్గా, క్రియాశీలక కేసుల విషయంలో అది 23 రోజులకు చేరింది. కోలుకున్న వారి (రికవరీ) శాతం శనివారం నాటికి 49.94కి పెరిగింది.

మహిళలకు అధిక ముప్పు

గ్లోబల్‌ హెల్త్‌ సైన్సెస్‌ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో కరోనా బారిన పడిన మహిళల్లో మరణాల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. మే 20వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన పురుషుల్లో 2.9% మరణాలు సంభవించగా మహిళల్లో అది 3.3% వరకు ఉన్నట్లు తేలింది.

యూపీలో మరణాల మిస్టరీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు అత్యధిక మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ శనివారం వరకు సంభవించిన 365 మరణాల్లో దాదాపు 65% మంది 21-60 ఏళ్లలోపు వారేనని తేలింది.

దడ పుట్టిస్తున్న గణాంకాలు

  • దేశంలో కరోనా కేసులు లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి 16 రోజులు పట్టగా, పది రోజుల్లోనే మరో లక్ష పెరిగి 3 లక్షలకు చేరాయి. రోజువారీ కేసులు 9 వేల నుంచి 10 వేలకు చేరడానికి 8 రోజులు పట్టగా, ఒక్కరోజులోనే 10 వేలనుంచి 11 వేలకు చేరాయి.
  • దేశంలో ప్రతి పది లక్షల మందికి సగటున 6.48 మరణాలు సంభవిస్తున్నాయి. దిల్లీలో అత్యధికంగా 64.88 మంది కన్నుమూస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (30.18), గుజరాత్‌ (22.17), మధ్యప్రదేశ్‌ (5.17), తమిళనాడు (4.71), పశ్చిమబెంగాల్‌ (4.53), తెలంగాణ (4.42) ఉన్నాయి.
  • కోలుకున్న వారి సంఖ్య గత 24 గంటల్లో 7135, మొత్తం 1,54,330.
  • ఐసీఎంఆర్‌ తాజా లెక్కల ప్రకారం పరీక్షలు చేసిన వారిలో ప్రతి 17.82 మందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. గత 24 గంటల్లో మాత్రం ప్రతి 12.5 మందిలో ఒకరికి వైరస్‌ సోకింది.

ఇదీ చూడండి: 'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం'

Last Updated : Jun 14, 2020, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.