ETV Bharat / bharat

'వాళ్లు.. రేపు మరొకరిని బెదిరించొచ్చు'

author img

By

Published : Feb 4, 2021, 9:39 PM IST

హిందూ మహ సముద్ర ప్రాంతం(ఐఓఆర్​)లో అరాచక శక్తల్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. సముద్ర ప్రాంతాల్లో విరుద్ధ వాదనలు పనికి రావని తెలిపారు. ఐఓఆర్​ దేశాలకు రక్షణ సహకారం అందించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

defence minister rajnath singh
ఐఓఆర్​ దేశాల​కు రక్షణలో సహకరిస్తాం: రాజ్​నాథ్​

సముద్ర ప్రాంతాల్లో విరుద్ధ వాదనలు.. ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ఇవాళ ఒకరిని బెదిరించిన వారు రేపు మరొకరిని బెదిరించవచ్చని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో నిర్వహించిన ఇండియ‌న్ ఓషియ‌న్స్ రిజీయ‌న్(ఐఓఆర్​) రక్షణ మంత్రుల స‌మావేశానికి రాజ్​నాథ్​ హాజరయ్యారు. ఐఓఆర్​లో అరాచక శక్తులను అడ్డుకోవడానికి అన్ని దేశాలు.. కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలను ఉద్దేశిస్తూ రాజ్​నాథ్​ పరోక్షంగా ఈమేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

"సముద్ర ప్రాంతాల్లో విరుద్ధమైన వాదనల వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని ప్రపంచంలోని కొన్ని సముద్ర ప్రాంతాల్లో మనం ఇదివరకే చూశాం. అందుకే హిందూ మహా సముద్ర ప్రాతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. మనందరికీ ఉన్న ఉమ్మడి ఆస్తి హిందూ మహా సముద్రమే. ఇది అంతర్జాతీయ వాణిజ్యం, రవాణాకు అత్యంత ముఖ్యమైన మార్గం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చొరబాట్లు, అక్రమాలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు ఒకరిని బెదిరించిన వారు రేపు మన మీద బెదిరింపులకు దిగొచ్చు. అందుకే.. ఇలాంటి చర్యలను ఎదుర్కోవడానికి ఐఓఆర్​ దేశాలన్ని తప్పనిసరిగా చేతులు కలపాలి.

-- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

రక్షణలో సహకరిస్తాం..

హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల రక్షణ వ్యవస్థ బలోపేతానికి.. ఆయుధాలను ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణ కోసం ఐఓఆర్​ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఉగ్రవాదం, రక్షణ, వాణిజ్యంపై.. ఆయా దేశాలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

"ప్రపంచంలో హిందూ మహా సముద్ర ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 75శాతం సముద్ర వాణిజ్యాన్ని, 50శాతం వరకూ రోజువారి సరకు రవాణా ఈ ప్రాంతంలో జరుగుతోంది. భారత్‌కు హిందూ మహా సముద్రం ఎంతో ముఖ్యమైంది. 7,500 కి.మీ పొడవైన అతిపెద్ద తీర రేఖను భారత్‌ కలిగి ఉంది. భారత్‌ వివిధ రకాల క్షిపణి వ్యవస్థలను, తేలికపాటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, బహుళ ఉపయోగ తేలిక పాటి రవాణా విమానాలు,యుద్ధ నౌక‌లు‌, గ‌స్తీ నౌక‌లు‌, ఆర్టిల‌రీ తుపాకి వ్యవస్థ, ట్యాంకులు, రాడార్లు, మిలిట‌రీ వాహ‌నాలతో పాటు వివిధ రకాల ఆయుధ వ్యవస్థను హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది.

--రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి

హిందూ మహా సముద్ర దేశాలు నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్​ అన్నారు. ప్రాంతీయ సహకారం ద్వారా మరింత అభివృద్ధిని సాధించవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి:'తేజస్'​ ఎక్కిన ఎంపీ తేజస్వీ సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.