ETV Bharat / bharat

సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ బిల్లు!

author img

By

Published : Feb 9, 2021, 3:37 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లోక్​సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పంజాబ్​కు చెందిన ఎంపీల బృందం దీన్ని తీసుకురానున్నట్లు ఆ పార్టీ ఎంపీ మనీశ్​ తివారీ తెలిపారు. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని యత్నిస్తున్నట్లు చెప్పారు.

Cong MPs from Punjab to move private member's bill in Lok Sabha to repeal farm laws
సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ బిల్లు

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు లోక్​సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 'రిపీలింగ్ అండ్ అమెండ్​మెంట్ బిల్ 2021' పేరిట ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తెలిపారు. తనతోపాటు ప్రణీత్ కౌర్, జస్బీర్​ సింగ్ గిల్, సంతోఖ్ చౌదరి సహా పలువురు పార్టీ ఎంపీలు కలిసి దీన్ని ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు.

రైతుల పట్ల సానుభూతితో ఉన్న ఇతర పార్టీల ఎంపీలను ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరనున్నట్లు తెలిపారు తివారీ. రాజ్యసభలోనూ ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీకి చెందిన సభ్యులను అభ్యర్థిస్తామని చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల అన్నదాతలు దిల్లీ సరిహద్దులో బైఠాయించారు. ఈ చట్టాలు వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేస్తాయని ఆరోపిస్తున్నారు. వీటిని రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఇదీ చదవండి: 'టీకా తీసుకునే వారికి బీమా లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.