ETV Bharat / bharat

'జాతి గర్వాన్ని దెబ్బతీస్తే ఏ శక్తికైనా దీటుగా బదులిస్తాం'

author img

By

Published : Jan 15, 2021, 5:22 AM IST

ఏదైనా 'సూపర్‌ పవర్' భారతజాతి గర్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే దీటుగా జవాబు ఇవ్వగల సైనికులు తమకున్నారని రక్షణ మంత్రి రాజనాథ్​ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరి రక్షణే తమ ధ్యేయమని, పొరుగు దేశాలతో వివాదాలు కోరుకోవడం లేదన్నారు. శాంతి, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు.

Befitting reply if any 'superpower' hurts national pride: Rajnath Singh
జాతి గర్వాన్ని దెబ్బతీసే ఏ శక్తికైనా దీటుగా బదులిస్తాం

భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా 'సూపర్‌ పవర్' భారతజాతి గర్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే దీటుగా జవాబు ఇవ్వగల సైనికులు తమకున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి రక్షణే తమ ధ్యేయమని, పొరుగు దేశాలతో వివాదాలు కోరుకోవడం లేదని వెల్లడించారు. శాంతి, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకే ప్రాధాన్యం ఇస్తామని నొక్కి చెప్పారు.

ఎనిమిది నెలలుగా చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ ఇలా మాట్లాడారు. బెంగళూరులోని భారతీయ వాయుసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల వెటరన్స్‌‌ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ హాజరయ్యారు.

'పొరుగు దేశాలతో శాంతి, స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన రక్తం, సంస్కృతిలోనే ఉంది. గతంలో ఎన్నడూ చూడనివి కొన్ని ఈసారి చోటు చేసుకున్నాయి. భారత సైనిక దళాలు అలాంటి సాహసోపేత కార్యకలాపాలు చేపట్టడాన్ని ఎవ్వరూ ఊహించలేరు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వలేను' అని రాజ్‌నాథ్‌ అన్నారు. పాకిస్థాన్‌ గడ్డపై ఉగ్రవాదులను ఏరిపారేసిన సైనికుల ధైర్యాన్ని ఆయన కీర్తించారు.

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు సమాజం, యువతకు స్ఫూర్తినిచ్చేందుకు కీలక పాత్ర పోషించాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. వెటరన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ప్రభుత్వం ఇప్పటికే మీకెంతో చేసింది. ఇంకెంతో చేయాల్సింది ఉందని నాకు తెలుసు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే ఒకే ర్యాంకు ఒకే పింఛన్‌ డిమాండ్‌ను నెరవేర్చారు. మాజీ సైనికుల ఆరోగ్య పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొనేందుకు ప్రైవేటు ఆస్పత్రులను నామినేట్‌ చేసే అధికారం స్థానిక కమాండర్లకు ఇచ్చాం' అని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'తేజస్​ ముందు చైనా యుద్ధ విమానాలు డీలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.