ETV Bharat / bharat

'ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వారిపై చర్యలు తీసుకోండి'

author img

By

Published : Jun 11, 2020, 1:36 PM IST

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసింది రాజస్థాన్​ కాంగ్రెస్​. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొంది.

Rajasthan govt
ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే వారిపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్​

రాజస్థాన్​లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్​, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది కాంగ్రెస్​. ఎమ్మెల్యేలను ప్రలోభపరిచి రాజకీయ అనిశ్చితికి తెరలేపాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్​ జనరల్​కు లేఖ రాశారు కాంగ్రెస్​ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ మహేశ్​ జోషి.

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను ప్రలోభపరిచేందుకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు చొప్పున భాజపా ఎరవేస్తోందని ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది సమయానికే మహేశ్​ జోషి ఈ మేరకు ఫిర్యాదు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

" ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యులను ప్రలోభ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఖండించాల్సిన చర్య. ఇలాంటివాటికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."

- మహేశ్​ జోషి. కాంగ్రెస్​ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​

అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్ర భాజపా నేతలు ఖండించారు. కాంగ్రెస్​ నిరాధార ఆరోపణలు చేస్తుందని.. ఇందుకు సాక్ష్యాలు చూపాలని డిమాండ్​ చేశారు.

రానున్న రాజ్యసభ ఎన్నికల కసరత్తుపై ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కాంగ్రెస్​, స్వతంత్ర ఎమ్మెల్యేలు గురువారం జైపుర్​లోని శివ విలాస్​ రిసార్ట్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్​తోనే ఉన్నానని, తనకు ఎలాంటి ఆఫర్​ అందలేదని పేర్కొన్నారు స్వతంత్ర ఎమ్మెల్యే మహదేవ్​ సింఘ్​ ఖండ్ల.

ఇదీ చూడండి: 'భాజపా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఎరవేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.