ETV Bharat / bharat

గత సార్వత్రికంలో పార్టీలకు రూ.6,400 కోట్ల విరాళాలు

author img

By

Published : Jul 3, 2020, 6:44 AM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం రూ. 6400 కోట్ల విరాళాలు అందినట్లు అసోసియేషన్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రిఫామ్స్​ (ఏడీఆర్​) సంస్థ తెలిపింది. ఈ మొత్తం విరాళాల్లో 63 శాతం భాజపా ఖాతాలోకి వచ్చి చేరినట్లు వెల్లడించింది. రెండో స్థానంలో కాంగ్రెస్​ ఉండగా, తర్వాతి స్థానాల్లో వైకాపా, తృణమూల్​ కాంగ్రెస్​లు ఉన్నాయి.

At Rs 1,450 cr, BJP got 61% funding via Electoral Bonds before ls polls
పార్టీలకు అందిన విరాళాలు రూ. 6,400 కోట్లు

గత సార్వత్రిక (2019) ఎన్నికల సమయంలో దేశంలోని 32 రాజకీయ పార్టీలు రూ.6,400 కోట్ల విరాళాలు సేకరించినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ పేర్కొంది. ఈ మొత్తం విరాళాల్లో అత్యధికం రూ.4,057 కోట్లు (63%) భాజపా ఖాతాలో చేరాయి. రూ.1,167 కోట్ల విరాళాలతో కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వైకాపా, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

  • రాజకీయ పార్టీలు రూ.6400 కోట్లను విరాళాలుగా స్వీకరించినప్పటికీ రూ.2,591 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టినట్లు ఆయా పార్టీలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నివేదిక పేర్కొంది. ఈ వ్యయ మొత్తంలో రూ.1,141 కోట్ల (44%)తో భాజపానే ప్రథమ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ రూ.626 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రాంతీయ పార్టీలైన బీజేడీ, వైకాపా, డీఎంకెలు అత్యధికంగా రూ.80 నుంచి రూ.190 కోట్ల వరకు ఖర్చు పెట్టాయి.
  • రాజకీయ పార్టీల ఖర్చులో అత్యధికం రూ.1,500 కోట్లు ప్రచారానికే వెచ్చించారు. ప్రయాణాలకు రూ.567 కోట్లు ఖర్చు చేశారు. రూ.528 కోట్లు పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారు.
  • ప్రచార ఖర్చు రూ.1,500 కోట్లలో రూ.1,166 కోట్లు మీడియాలో ప్రకటనల కోసమే చెల్లించారు. ఇందులో భాజపా వాటా 44%, కాంగ్రెస్‌ భాగం 32%.
  • ప్రయాణం కోసం ఖర్చు పెట్టిన రూ.567 కోట్లలో 98% మొత్తాన్ని పార్టీలు స్టార్‌ క్యాంపెయినర్ల కోసమే వెచ్చించాయి. మిగిలిన మొత్తాన్ని ఇతర నాయకుల కోసం ఖర్చు చేశాయి.
  • స్టార్‌ క్యాంపెయినర్ల ప్రయాణం కోసం భాజపా రూ.253 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్‌ రూ.127 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.50 కోట్లు వెచ్చించాయి.
  • గత ఎన్నికల సమయంలో ఎన్నడూలేనంతగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. రూ.3,475 కోట్ల విలువైన డబ్బు, మద్యం, నగలు పట్టుబడ్డాయి.
  • 2004 నుంచి 2020 వరకు చట్ట సభలకు ఎంపికైన 15,032 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో... 4,870 మందికి నేర నేపథ్యం ఉంది. ఇందులో 2,795 మందిపై హత్య, అత్యాచారం, అవినీతి, అక్రమ వసూళ్ల వంటి నేరాభియోగాలు నమోదయ్యాయి.
  • ఎంపీలు, ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.7.05 కోట్లయితే, రెండో స్థానంలో నిలిచిన వారి ఆస్తి విలువ రూ6.32 కోట్లు, మూడో స్థానానికి పరిమితమైన వారి ఆస్తి సగటు విలువ రూ.1.24 కోట్లుంది. దీన్ని బట్టి డబ్బున్న వారికే విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
  • 2004 నుంచి 2020 వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన 1,49,375 మంది అభ్యర్థుల తలసరి సగటు ఆస్తి విలువ రూ.2.30 కోట్లు. అందులో ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారి ఆస్తి విలువ రూ.7.05 కోట్లు. అందులోనూ క్రిమినల్‌ కేసులున్న వారి సగటు ఆస్తి విలువ రూ.9.11 కోట్లు. తీవ్ర నేరాభియోగాలున్న వారి సగటు ఆస్తి విలువ రూ.9.44 కోట్లు.

ఇదీ చూడండి:ఆ ఎన్నికల నిర్వహణపై పాక్​ను తప్పుబట్టిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.