ETV Bharat / bharat

ప్లాస్మా దానం చేసిన 30 మంది జవాన్లు

author img

By

Published : Oct 4, 2020, 10:55 AM IST

దేశ ప్రజల కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తున్నప్పుడు ప్లాస్మా దానం పెద్ద విషయమే కాదంటున్నారు జవాన్లు. మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఏర్పాటు చేసిన శిబిరంలో 30 మంది ప్లాస్మా ఇచ్చారు. వైరస్​ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చి కొవిడ్​ పోరులో భాగం కావాలని పిలుపునిచ్చారు.

Army personnel donate plasma
జవాన్ల ప్లాస్మా దానం

కొవిడ్​ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్​ అందుబాటులో లేకపోవడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇది ఉపయోగపడుతోంది. ఇందుకోసం తాజాగా 30 మంది జవాన్లు ముందుకొచ్చారు. తమ వంతుగా ప్లాస్మా దానం చేసి మరింత మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మధ్యప్రదేశ్​ ఇండోర్​ జిల్లా మోవోలోని మహారాజ యశ్వంతరావు హోల్కర్​ ఆసుపత్రి, ఎంజీఎం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో.. జవాన్ల నుంచి బ్రిగేడియర్​ ర్యాంకుల వరకు ఆర్మీ సిబ్బంది ప్లాస్మా ఇచ్చారు.

" మాలో చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. వారంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రజల కోసమే సైన్యం ఉంది. వారి కోసం మా జీవితాలను త్యాగం చేసేందుకైనా సిద్ధం. జీవితాలనే ఇచ్చేస్తున్నప్పుడు ప్లాస్మా దానం చేయటం పెద్ద విషయం కాదు."

- లెఫ్టినెంట్​ జనరల్​ అనంత్​ నారాయణన్, కమాండెంట్​, పదాతిదళ పాఠశాల,ఇండోర్​

కరోనా పోరులో జవాన్లు ఇచ్చిన ప్లాస్మా 60 మంది కొవిడ్​ రోగుల చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు ఎంజీఎం కళాశాల ప్రొఫెసర్​ డాక్టర్​ అశోక్​ యాదవ్​. ప్రస్తుత సమయంలో ప్లాస్మా సేకరించటం సవాలుగా మారిందని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జవాన్లు ప్లాస్మా ఇవ్వటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ప్రొఫెసర్​.

ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇండోర్​లో శనివారం 477 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 25,928కి చేరింది. 592 మంది మరణించారు.

ఇదీ చూడండి: కరోనా కేర్​ సెంటర్​లో బాధితుల యోగాసనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.