బ్యాంక్ జాబ్​లో చేరిన 5నెలల్లోనే స్కామ్​.. భార్య ఖాతాలోకి కోట్లు.. పని కాగానే జంప్!

author img

By

Published : Sep 13, 2022, 7:12 PM IST

bank of baroda scam news

ఆ యువకుడు ఐదు నెలల క్రితమే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా చేరాడు. ఇంతలోనే కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. ఏం జరిగిందో గుర్తించేలోపే మాయమైపోయాడు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

భార్య ఖాతాలోకి ఏకంగా రూ.2.69కోట్లు బదిలీ చేసి, ఒక్కసారిగా మాయమైపోయాడు ఓ బ్యాంకు ఉద్యోగి. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర్​లో బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జరిగిందీ బడా మోసం. ఐదు నెలల క్రితమే విధుల్లో చేరిన అతడు.. ఇంతటి స్కామ్ చేశాడని ఆలస్యంగా తెలుసుకుని బ్యాంకు ఉన్నతాధికారులు నివ్వెరపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బోనాల కుమార్.. ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఐదు నెలల క్రితమే యల్లాపుర్​లోని బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో అసిస్టెంట్​ మేనేజర్​గా చేరాడు. అప్పటి నుంచి విడతల వారీగా తన భార్య ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేశాడు. అలా సెప్టెంబర్​ 5 నాటికి మొత్తం రూ.2.69కోట్లు ఆమె ఖాతాలోకి బదిలీ అయ్యాయి.

కుమార్ కొద్దిరోజులుగా విధులకు హాజరు కావడం లేదు. బ్యాంకు అధికారులు సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. బ్యాంకు ఖాతాలన్నీ పరిశీలించగా.. నగదు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. హుటాహుటిన యల్లాపుర్ పోలీస్ స్టేషన్​లో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఫిర్యాదు చేశారు. కుమార్ భార్య ఖాతాను చెక్ చేయగా.. అందులో ఒక్క రూపాయి కూడా లేదని తేలింది. ఆ డబ్బంతా ఏ ఖాతాలకు బదిలీ అయింది, అసలు కుమార్ ఎక్కడున్నాడు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్ ఈ పనిని ముందస్తు ప్రణాళికతో చేశాడని ఉత్తర కన్నడ జిల్లా ఎస్​పీ సుమన్​ చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బ్యాంకులోని క్లర్క్​లు, ఇతర సిబ్బంది ఐడీలను ఉపయోగించి.. తన భార్య ఖాతాలోకి నగదు బదిలీ చేశాడని వివరించారు. మరోవైపు.. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, వారి డబ్బంతా సురక్షితంగా ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.