ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: భారత్​పై పెత్తనం కోసం ఆంగ్లేయుల 'లీగ్‌' ఆట!

author img

By

Published : Dec 30, 2021, 6:29 AM IST

Azadi Ka Amrit Mahotsav: డిసెంబరు 30... సంవత్సర ముగింపునకు సంకేతం! 1906లో కూడా భారతీయులు అలాగే అనుకుంటూ.. నిద్రలేచారు. కానీ జాతీయోద్యమంలో ఈ రోజు కొత్త మలుపునకు తెరలేవబోతోందని వారు ఊహించలేదు. అదే.. ముస్లిం లీగ్‌ ఆవిర్భావం! తమ 'విభజించు - పాలించు' సూత్రంలో భాగంగా ఆవిష్కృతమైన ముస్లిం లీగ్‌ను.. ఆంగ్లేయులు చివరి దాకా పెంచి పోషించుకుంటూ వచ్చారు! భారత లౌకికత్వాన్ని దెబ్బ తీయటమేగాకుండా.. ఈ 'లీగ్‌'ను అడ్డంపెట్టుకొని ఉపఖండంపై శాశ్వత పెత్తనం కోసం పెద్ద ఆటే ఆడారు.

all india muslim league
ముస్లిం లీగ్‌ ఆవిర్భావం

British Rule: 1857 సిపాయిల తిరుగుబాటును అణచివేసిన తర్వాత.. బ్రిటిష్‌ ప్రభుత్వం 'విభజించు-పాలించు' సూత్రానికి పదును పెట్టింది. భారత సమాజాన్ని వీలైనన్ని విధాలుగా విభజించింది. హిందూ-ముస్లింల ఐక్యత తమకు ప్రధాన ముప్పుగా గుర్తించింది. దానికి గండి కొట్టేందుకు వ్యూహం రచించింది.

ఇంతలో ఏఓ హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించి (1885).. భారతీయుల్లో కొత్త ఆలోచనలను తట్టి లేపారు. హిందు, ముస్లిం, పార్శీ.. ఇలా మతాలకు అతీతంగా కాంగ్రెస్‌ భారతీయులందరి పార్టీగా బలపడసాగింది. బద్రుద్దీన్‌ త్యాబ్జి, రహీముతుల్లా సయానిలాంటి ముస్లిం నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు కూడా. ఈ పరిణామాలతో తెల్లవారు ఉలిక్కిపడి తమ వ్యూహాల్లో వేగం పెంచారు. తొలుత వైస్రాయ్‌ కర్జన్‌ 1905 జులైలో బెంగాల్‌ను విభజించారు. ముస్లింలు అధికంగా ఉన్న భాగాన్ని తూర్పు బెంగాల్‌గా ఏర్పాటు చేశారు. కానీ, ఈ విభజన ప్రభావం పరిమితం కావటంతో కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయి.

ఏమి అడగాలంటే..

"కాంగ్రెస్‌ బలపడుతోంది. ముస్లింలంతా చేరితే బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ముప్పు ఎదురయ్యే ప్రమాదముంది. కాంగ్రెస్‌కు పోటీని సృష్టించటం గురించి ఆలోచించాలి" అంటూ కర్జన్‌ తర్వాతి వైస్రాయ్‌ మింటో లండన్‌ను హెచ్చరించాడు. 1906 జులై 26న హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మంత్రి మోర్లీ ప్రసంగిస్తూ.. భారత లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లలో సంస్కరణలు తెస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే అలీగఢ్‌ కాలేజీ కార్యదర్శి నవాబ్‌ మెహదీ అలీఖాన్‌ తమ బ్రిటిష్‌ ప్రిన్సిపల్‌ ఆర్చ్‌బోల్డ్‌కు లేఖ రాయటం గమనార్హం. ముస్లింల హక్కుల గురించి వైస్రాయ్‌ మింటోతో మాట్లాడటానికి తమ ప్రతినిధి బృందానికి అవకాశం ఇప్పించాలన్నది ఆ లేఖ సారాంశం. లండన్‌ సూచనల మేరకు.. వైస్రాయ్‌ మింటో ఆ భేటీకి అంగీకరించారు. వైస్రాయ్‌కి ఇచ్చే వినతి పత్రంలో ఏం ఉండాలో, ఎలా ఉండాలో.. ఆంగ్లేయుడైన ఆర్చ్‌బోల్డ్‌ నిర్దేశించటం విశేషం. "బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసం ప్రకటిస్తూ.. కాంగ్రెస్‌ పట్ల అపనమ్మకం వ్యక్తంజేస్తూ.. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ముస్లింలకు ప్రత్యేక హక్కులు కోరుతూ జాగ్రత్తగా వినతి పత్రం తయారు చేసుకొని రండి. కావాలంటే దాన్ని సరిదిద్దిస్తాను. ఇదంతా భారత ముస్లింల అభిప్రాయంగా ఉండాలి. నా పేరు ఎక్కడా ప్రస్తావించవద్దు" అంటూ నవాబ్‌ మెహదీకి ఆర్చ్‌బోల్డ్‌ సూచించారు.

All India Muslim league formed in: 1906 అక్టోబరు 1న ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల ముస్లిం ప్రతినిధుల బృందం వైస్రాయ్‌ మింటోను శిమ్లాలో కలిసింది. ఆగాఖాన్‌ వినతి పత్రాన్ని చదివి వినిపించారు. "జనాభా బలం ఆధారంగానే కాకుండా.. గతంలోని రాజకీయ ప్రాధాన్యం, బ్రిటిష్‌ సామ్రాజ్యానికి అండగా నిలుస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు (భారతీయ ముస్లింలకు) ప్రత్యేక హక్కులు కల్పించాలి" అంటూ ఆగాఖాన్‌ వివరించారు. వైస్రాయ్‌ సానుకూలంగా హామీ ఇచ్చాడు. ఈ భేటీ తర్వాత 90 రోజులకు.. ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వేదికగా.. డిసెంబరు 30న ఆలిండియా ముస్లిం లీగ్‌ ఆవిర్భవించింది. ఈ సమావేశానికి హాజరుకాకున్నా.. సుల్తాన్‌ మహమ్మద్‌ షా (ఆగాఖాన్‌-3)ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తొలుత దూరంగా ఉన్న జిన్నా.. 1913లో లీగ్‌లో చేరారు. తమకు ప్రత్యేక లీగ్‌ ఏర్పడ్డా చాలామంది ముస్లింలు జాతీయోద్యమంలో కాంగ్రెస్‌ తరఫున పాల్గొనటం విశేషం. 1930 తర్వాత లీగ్‌ గళం ఊపందుకొని ప్రత్యేక దేశం దిశగా సాగింది. దేశ విభజన తర్వాత ఈ ఆలిండియా ముస్లిం లీగ్‌ రద్దయింది. దేశ విభజనకు దారి తీసిందే తప్ప.. లీగ్‌ వల్ల ఆంగ్లేయుల శాశ్వతాధికార కల మాత్రం నెరవేరలేదు.

ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: పుస్తకాలు అమ్మి ఆయుధాలు కొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.