ETV Bharat / bharat

చెలరేగిన అల్లర్లు.. గాంధీయే ఆయుధాలు పట్టమన్న వేళ..

author img

By

Published : Jul 28, 2022, 7:15 AM IST

జీవితాన్ని అహింసకే అంకితం చేసి.. హింస జరిగిందని సహాయ నిరాకరణ ఉద్యమాన్నే ఆపేసిన మహాత్ముడు.. స్వాతంత్య్రం సిద్ధించే వేళ చెలరేగిన అల్లర్లపై తన శైలికి భిన్నంగా ఆగ్రహోదగ్రుడయ్యారు. హిందూ/ముస్లిం మైనారిటీల రక్షణకు ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు. మత మౌఢ్యుల నిర్మూలనకు అవసరమైతే ఆయుధాలను పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూక సంస్కృతి నుంచి మైనారిటీలను రక్షించేందుకు బెంగాల్‌, బిహార్‌లకు వెళ్లారు. హిందువుల రక్షణకు పాకిస్థాన్‌ వెళ్లడానికీ సిద్ధపడ్డారు.

gandhi
గాంధీ

దేశంలోని ముస్లింలు అధికంగా ఉన్న వాయవ్య, తూర్పు ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్‌ చేస్తూ ముస్లింలీగ్‌ నేత మహమ్మద్‌ అలీ జిన్నా 1946 ఆగస్టు 16న 'ప్రత్యక్ష చర్య'కు పిలుపునిచ్చారు. దాంతో కోల్‌కతాలో అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఆ ఏడాది దేశమంతటా సుమారు 3360 వరకు చోటుచేసుకున్నాయి. బెంగాల్‌లోని నోవాఖలీ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)తో పాటు పరిసరాల్లోని పది గ్రామాల్లో 1946 అక్టోబరు 10న అనూహ్యంగా దాడులు, హత్యలు జరిగాయి. నోవాఖలీ నరమేధంపై గాంధీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాను జీవితాంతం అవలంబించిన అహింస, సత్యాగ్రహాలకు ఇది పరీక్ష కాలమని వ్యాఖ్యానించారు. నవంబరు 6న బాధిత ప్రాంతాలకు వెళ్లి 1947 మార్చి 2 వరకు అక్కడే గడిపారు. గ్రామాల్లో తిరుగుతూ బాధితులకు సాంత్వన చేకూర్చారు. మతం పేరిట జరిగే దాడులను ఖండించారు. 'తమను తాము నిస్సహాయులుగా భావించే వేల మందినైనా పిడికెడు మంది హింసావాదులు భయపెట్టగలరు. మహిళలు తమపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాల్సిందే! పిరికివాళ్లను ప్రపంచంలోని ఏ సైన్యంగానీ, పోలీసులు గానీ కాపాడలేరు. చేవగలిగిన వేల మంది వ్యక్తులు వీధుల్లోని కొద్దిమంది మతమౌఢ్యుల చేతిలో చావడం గొప్పకాదు. అభాగ్యులైన మహిళల ఇళ్లు కూల్చివేశారు. వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారిని భయపెట్టి మతం మార్పించారు. బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనలు హిందువులకు సిగ్గుచేటు. ఇస్లాంకు అపకీర్తి. నోవాఖలీ దుశ్చర్యకు ప్రతిచర్యగా బిహార్‌లో ముస్లింలపై హిందువులు దాడి చేయడమూ నన్నెంతో కలచివేసింది. బిహారీలకు తోటి మతస్థులపై ప్రేముంటే నోవాఖలీకి వచ్చి పోరాడాల్సింది. కానీ.. కొద్దిమంది ముస్లింలపై దాడులకు దిగడం పిరికిపంద చర్యే. అనాగరికతపై అనాగరికంగానే విరుచుకుపడటం మగతనం కాదు. 24 గంటల్లో దాడులు ఆగిపోకుంటే నేను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా' అని హెచ్చరించారు. గాంధీ పాదయాత్రపై బెంగాల్‌, ఇతర రాష్ట్రాల నాయకులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో తన పాదయాత్రలు బాధితుల గాయాలను మాన్పేందుకే అని మహాత్ముడు స్పష్టం చేశారు.

ఏళ్లుగా వాళ్లు చేసింది అదే కదా?: గాంధీజీ ఏ గ్రామానికి వెళ్లినా తమ వర్గం పోలీసులను, అధికారులను పంపించాలని విన్నవించుకోగా.. 'మీరు కోరుకుంటున్న పోలీసులు, అధికారులు కొన్ని వందల ఏళ్లుగా చేసింది దోపిడీలు, అత్యాచారాలే కదా? ఇప్పుడు వారొచ్చి మీకు సాయపడేది ఏముంటుంది? మనిషిలో పరమత సహనం రానంతవరకూ, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించే లక్షణం మేల్కొననంత వరకూ సౌభ్రాతృత్వం నెలకొనదు' అని గాంధీజీ వారికి బోధించారు.

అవసరమైతే పాకిస్థాన్‌ వెళతా: నోవాఖలీ అల్లర్లకు ప్రతీకారంగా బిహార్‌లో 1946 అక్టోబరు-నవంబరు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే 1947 మార్చి 5న పట్నాకు చేరుకున్న గాంధీజీ ప్రతీకార దాడులను తీవ్రంగా ఖండించారు. భారత్‌లోని మైనారిటీలపై గాంధీజీ అమితప్రేమ చూపిస్తున్నారని, మరి త్వరలో ఏర్పడనున్న పాకిస్థాన్‌లోని మైనారిటీలను ఎవరు రక్షిస్తారంటూ కొందరు ప్రశ్నించారు. దాంతో.. వారి రక్షణకు తాను స్వయంగా పాకిస్థాన్‌ వెళతానని గాంధీ అన్నారు. ఇదే విషయమై నాటి గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటెన్‌ ఇంగ్లండ్‌కు రహస్య లేఖ పంపారు. గాంధీ పాకిస్థాన్‌ వస్తే తమకు తలనొప్పులు తప్పవేమోనని జిన్నా సహా ముస్లింలీగ్‌ నాయకులు ఆందోళన పడుతున్నట్లు అందులో రాశారు. అయితే పాకిస్థాన్‌ వెళ్లకుండానే ఆయన కన్నుమూశారు.

ఇవీ చదవండి: విదేశీ బట్టలు వద్దన్నందుకు లారీతో తొక్కించి..

గాంధీ లేని నాటకం రాస్తే రూ.50 వేలు ఇస్తామన్న ఆంగ్లేయులు.. తలొగ్గని దేశభక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.