ETV Bharat / bharat

విదేశీ బట్టలు వద్దన్నందుకు లారీతో తొక్కించి..

author img

By

Published : Jul 27, 2022, 9:11 AM IST

Azadi Ka Amrit Mahotsav Babu Genu Said
Azadi Ka Amrit Mahotsav Babu Genu Said

అతనో నిరుపేద యువకుడు. బట్టల మిల్లులో కార్మికుడు. ఎప్పుడో కానీ రెండుపూటలా భోజనం చేయలేడు. మూడు జతల దుస్తులు, భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆయన ఆస్తులు. దేశభక్తిలో మాత్రం తనని మించిన ధనికులు లేరు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఒంటిపై ఉన్న విదేశీ దుస్తులను కాల్చేశాడు. తన ప్రాణాలనూ తృణప్రాయంగా బలిచ్చాడు. తప్పుకొనేందుకు అవకాశమున్నా తన పేరు తరతరాలకు గుర్తుండేలా రక్తతర్పణం చేశాడు. అతడే.. భరతమాత ముద్దుబిడ్డ బాబూ గేను సేద్‌.

Azadi Ka Amrit Mahotsav Babu Genu Said: మహారాష్ట్రలోని మహాలుంగే పడ్వాల్‌ ప్రాంతంలో 1908 జనవరి 1న బాబూ గేను సేద్‌ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. వారి కుటుంబానికి ఏ రోజుకారోజు పూట గడవడమే మహాభాగ్యంగా మారింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకు దూరమయ్యారు. పశువుల కాపరిగా కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తూ బాల్యాన్ని నెట్టుకొచ్చిన బాబూ.. ముంబయి వెళ్లి అక్కడ ఓ మిల్లులో కార్మికుడిగా చేరారు. శాసనోల్లంఘనలో భాగంగా స్వదేశీ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయమది. ఉద్యమకారులు పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడికక్కడ విదేశీ వస్త్రాలు, వస్తువులను దహనం చేస్తున్నారు.

ఇంటింటి నుంచి దుస్తులను సేకరించి, ముంబయిలోని ప్రధాన కూడళ్లలో నిప్పంటించేవారు. బాబూ గేను కూడా ఈ ఉద్యమంతో స్ఫూర్తి పొందారు. మిల్లు కార్మికుడిగా వచ్చే జీతంలో కొంత ఇంటికి పంపగా, మిగిలే డబ్బుతో రెండు పూటలా భోజనం చేయడమే ఆయనకు భారంగా తయారైంది. మూడు జతల దుస్తులే ఉండేవి. రేపటికి ధరించడం ఎలాగని ఆలోచించకుండా.. ఆ విదేశీ దుస్తులను మంటల్లో కాల్చేశారు. అతికష్టంగా ఒక జత ఖాదీ దుస్తులను సంపాదించుకున్నారు. అనంతరం ముంబయిలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని తయారు చేసిన గేను.. స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.

Azadi Ka Amrit Mahotsav Babu Genu Said
భరతమాత ముద్దుబిడ్డ బాబూ గేను సేద్‌

అతను నా సోదర సమానుడు
ముంబయి ఓడరేవుకు ఉద్యమకారులు బృందాలుగా వెళ్లేవారు. బ్రిటన్‌ నౌకల నుంచి దుస్తులు, వస్తువులను దించగానే కాల్చేస్తుండేవారు. ఇలాగే.. 1930 డిసెంబరు 12న విదేశీ దుస్తులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న బాబూ గేను తన బృందంతో అక్కడికెళ్లారు. ఓడలోంచి వాటిని దింపొద్దని, తిరిగి తీసుకెళ్లండని కోరారు. ఒకవేళ దింపితే ఇక్కడే నిప్పు పెడతామని హెచ్చరించారు. ఆయన మాటలను లెక్కచేయని ఆంగ్లేయులు ఓడ నుంచి దుస్తులను కిందికి దింపారు. వాటిని లారీలోకి ఎక్కించి ముంబయిలోని పాత హనుమాన్‌ గల్లీలోకి పంపించారు. బాబూ గేను ఆ లారీని వెంబడించి భంగ్‌వాడీ సమీపంలోని కల్బాదేవి రోడ్డు వద్ద అడ్డుకున్నారు. తన బృందంతో కలిసి లారీకి అడ్డంగా పడుకున్నారు.

అడ్డు తొలగాలని కోరినా వినకపోవడంతో పోలీసులు ఉద్యమకారులను బలవంతంగా తోసేశారు. బాబూ మాత్రం ససేమిరా అన్నారు. దీంతో అక్కడే ఉన్న ఆంగ్లేయ పోలీసు అధికారి.. 'ఆ యువకుడిపై నుంచి వెళ్లు' అంటూ లారీ డ్రైవరుకు హుకుం జారీ చేశాడు. డ్రైవరు భారతీయుడే. 'నేను భారతీయుడిని.. అతనూ భారతీయుడే. మేమిద్దరం సోదరుల్లాంటి వాళ్లం. చూస్తూచూస్తూ సోదర సమానుడైన యువకుడిని ఎలా చంపుతాను' అంటూ పోలీసు అధికారిని ప్రశ్నించారు. తన ఆదేశాన్ని ధిక్కరించాడనే ఆగ్రహంతో పోలీసు అధికారి డ్రైవరును బలవంతంగా కిందికి తోసేశాడు. నిలువెల్లా ఊగిపోతూ డ్రైవరు సీట్లో తానే కూర్చున్నాడు. క్షణమైనా ఆలోచించకుండా బాబూ గేను గుండెల మీది నుంచి లారీని కర్కశంగా నడిపించాడు. అందరూ చూస్తుండగానే ఆ యువతేజం రక్తమోడ్చుతూ అక్కడికక్కడే భరతమాత ఒడిలో నేలకొరిగింది.

బాబూ పాశవిక హత్య సంఘటన అనంతర ఆగ్రహ జ్వాల ముంబయి సహా దేశంలోని ఇతర ప్రాంతాలను ఉప్పెనలా తాకింది. విదేశీ వస్తు బహిష్కరణోద్యమాన్ని మరింతగా రగిలించింది. స్వదేశీ ఉద్యమం ఊపందుకోవడానికి బాటలు వేసింది. భారతీయులు క్రమక్రమంగా స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. చక్కెరకు బదులు బెల్లం, బ్లేడు స్థానంలో స్వదేశీ కత్తి వాడటం ప్రారంభించారు. సూటూబూటును వదిలి ఖాదీ దుస్తులు ధరించసాగారు. స్వాతంత్య్రం సిద్ధించాక బాబూ గేను సేద్‌ స్మారకార్థం ముంబయిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన ప్రాణత్యాగం చేసిన వీధికి, ఒక స్టేడియానికి, పుణెలోని ఒక చౌరస్తాకు బాబు గేను సూద్‌ పేరు పెట్టారు.

ఇదీ చదవండి: గాంధీ లేని నాటకం రాస్తే రూ.50 వేలు ఇస్తామన్న ఆంగ్లేయులు.. తలొగ్గని దేశభక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.