ETV Bharat / bharat

అంధకారంలో ఉన్న ప్రజలకు దారి చూపిన 'త్రీస్టార్స్​'

author img

By

Published : Aug 12, 2022, 2:11 PM IST

Bombay Triumvirate: స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నా మార్గదర్శనం కరవైన సమయంలో ఆ ముగ్గురు స్నేహితులు సమాజానికి దారి చూపారు. వారే బద్రుద్దీన్​ తయబ్జీ, ఫిరోజ్​షా మెహతా, కాశీనాథ్​ తెలంగ్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను ప్రారంభించి ప్రజా చైతన్యానికి విస్తృతంగా కృషి చేశారు.

Bombay Triumvirate
అంధకారంలో ఉన్న ప్రజలకు దారి చూపిన 'త్రీస్టార్స్​'

Bombay Triumvirate: చుట్టూ చిమ్మచీకటి.. చేతిలో కాగడా లేదు. ప్రయాణాన్ని ఆపలేని పరిస్థితి. అప్పుడు ఆకాశంలోని వేగుచుక్కలే దారి చూపాయి. మొదటి స్వాతంత్య్ర పోరాటం విఫలమయ్యాక భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా.. మార్గదర్శనం కరవైంది. అలాంటి క్లిష్ట సమయంలో బద్రుద్దీన్‌ తయబ్జీ, ఫిరోజ్‌షా మెహతా, కాశీనాథ్‌ తెలంగ్‌ అనే ముగ్గురు విద్యావంతులైన స్నేహితులు.. వేగుచుక్కల్లా దూసుకొచ్చారు. 'త్రీస్టార్స్‌'గా వెలుగొందుతూ.. చెల్లాచెదురుగా ఉన్న నాటి సమాజానికి రాజకీయ, ఆర్థిక, పరిపాలన, విద్య, సామాజిక రంగాల్లో దారి చూపారు.

మహారాష్ట్రలోని కాంబేలో 1844, అక్టోబరు 8న బద్రుద్దీన్‌ తయబ్జీ అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు. లండన్‌లో న్యాయశాస్త్రం చదివాక బొంబాయి హైకోర్టులో తొలి భారతీయ బారిస్టర్‌గా చేరారు. అనంతరం అక్కడే తొలి ముస్లిం జడ్జిగా, తొలి భారతీయ చీఫ్‌ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. తన సోదరుడు కమ్రుద్దీన్‌తో కలిసి కాంగ్రెస్‌ వ్యవస్థాపక కమిటీలో పనిచేశారు. పార్టీ విధివిధానాలను రూపొందించారు. కాంగ్రెస్‌కు 1888లో జాతీయాధ్యక్షుడిగానూ పనిచేశారు. ముస్లింలను జాతీయోద్యమానికి దూరంగా పెట్టడం సరికాదంటూ కాంగ్రెస్‌లో తీర్మానం చేయించారు. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన బద్రుద్దీన్‌ అక్కడే 1906లో గుండెపోటుతో మరణించారు.

ఎస్‌బీఐ స్థాపనతో ముందడుగు.. బొంబాయిలో 1845 ఆగస్టు 4న సంపన్న పార్శీ దంపతులకు ఫిరోజ్‌షా మెహతా జన్మించారు. బొంబాయిలోనే 1864లో ఎంఏ పాసయ్యారు. లండన్‌లో న్యాయశాస్త్రం చదివాక 1868లో తిరిగొచ్చారు. న్యాయవాదిగా ఆంగ్లేయుల చట్టాలను నిశితంగా పరిశీలించేవారు. నాటి ఆయుధ, ప్రెస్‌, జంతుబలి చట్టాలను సవాల్‌ చేసి, ఎన్నో మార్పులు చేయించారు. భారతీయ పిల్లలకు స్థానిక విద్యా విధానమే అవసరమని, ఆ దిశగా పనిచేశారు. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు బొంబాయి క్రానికల్‌ వార్తా పత్రికను ప్రారంభించారు. మన ఆర్థిక వ్యవస్థ మన చేతుల్లోనే ఉండాలనే పట్టుదలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించారు. కాంగ్రెస్‌ స్థాపనలో కీలక భూమిక పోషించిన షా 1890లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దేశం కోసం అహర్నిశలూ కష్టపడిన ఆయన 1915 నవంబరు 5న కన్నుమూశారు.

వైవిధ్య రంగాల్లో అసమాన సామర్థ్యం.. బొంబాయిలో 1850 ఆగస్టు 20న కాశీనాథ్‌ త్రయంబక్‌ తెలంగ్‌ జన్మించారు. తల్లిదండ్రులు అయిదేళ్ల వయసులోనే అతన్ని గురుకులంలో చేర్పించారు. మరో అయిదేళ్లకు బొంబాయిలోనే ప్రతిష్ఠాత్మకమైన మౌంట్‌ స్టూవర్ట్‌ ఎల్ఫిన్‌స్టోన్‌ పాఠశాలకు మార్చారు. ఏకసంథాగ్రాహి కావడంతో ఉన్నత విద్యను వేగంగా పూర్తిచేశారు. ఎంఏ, న్యాయశాస్త్రం చదివాక 1872లో అంటే 22 ఏళ్ల వయసులోనే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అసమాన ప్రతిభతో 1889లో జడ్జిగా పదోన్నతి పొందారు. అదే సమయంలో సంస్కృతం నుంచి భగవద్గీతను, విశాఖదత్తుని ముద్రారాక్షసాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. మాతృభాష మరాఠీలోనూ గ్రంథాలు రాశారు. మనదేశంలో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టడానికి.. బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించిన హంటర్‌ కమిషన్‌లో సభ్యుడిగానూ పనిచేశారు. విద్య, న్యాయశాస్త్రాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా బొంబాయి శాసనమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ సమావేశ ఆతిథ్య కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. అమిత ప్రతిభావంతుడైన తెలంగ్‌ 43 ఏళ్ల వయసులోనే 1893లో మరణించారు.

ముగ్గురూ ముగ్గురే.. బద్రుద్దీన్‌, ఫిరోజ్‌షా, కాశీనాథ్‌ కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను ప్రారంభించి, ప్రజా చైతన్యానికి విస్తృతంగా కృషి చేశారు. అప్పట్లో బొంబాయి నగరపాలక సంస్థలో ఆంగ్లేయ అధికారుల మితిమీరిన జోక్యంతో అవినీతి భారీగా పెరిగింది. కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాలంటూ 1871లో ఈ త్రీస్టార్స్‌ బృందం ఉద్యమం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 1873లో తయబ్జీ కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. ఫిరోజ్‌షా బొంబాయి నగర కమిషనర్‌గా నియమితులై నగర రూపురేఖలను మార్చారు. ఆయన కృషితో బొంబాయి మున్సిపల్‌ చట్టం రూపొందింది. ఫిరోజ్‌షా చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆయనకు 'బొంబాయి సింహం' అనే పేరు స్థిరపడింది. అదే సమయంలో యువతను ప్రభావితం చేయడానికి బొంబాయి విశ్వవిద్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈక్రమంలో ఫిరోజ్‌షా, తెలంగ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్లుగా, బద్రుద్దీన్‌ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్‌ వ్యవస్థాపక సభ్యులుగా క్రియాశీలకంగా వ్యవహరించి.. స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించే సంస్థను దేశానికి అందించారు.

ఇదీ చదవండి: సామాన్యుడి 'స్వచ్ఛ' సంకల్పం.. కారునే చెత్త వాహనంగా మార్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.