ETV Bharat / bharat

ఆర్​టీఐ కార్యకర్తపై దుండగుల దాడి.. కాళ్లకు మేకులు దింపి...

author img

By

Published : Dec 23, 2021, 2:33 PM IST

Updated : Dec 23, 2021, 4:33 PM IST

Attack on RTI activists
ఆర్​టీఐ కార్యకర్తపై దుండగుల దాడి

Attack on RTI activists in India: ఆర్​టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక.. కాళ్లు, చేతులు విరగగొట్టారు. రెండు కాళ్లకు మేకులు దింపారు. చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఈ క్రూరమైన ఘటన రాజస్థాన్​ బాఢ్​మేర్​ జిల్లాలో జరిగింది. లిక్కర్​ మాఫియాపై ఫిర్యాదు చేసినందుకే మాజీ సర్పంచ్​ ఈ దాడి చేయించారని బాధితుడు ఆరోపించారు.

Attack on RTI activists in India: ఓ ఆర్​టీఐ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. కాళ్లు, చేతులు విరిగేలా తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కాళ్లకు ఇనుప చువ్వలు, మేకులను దింపి చిత్ర హింసలు పెట్టారు. చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్​, బాఢ్​మేర్​ జిల్లాలో జరిగింది. గిఢా పోలీస్​ స్టేషన్ పరిధిలోని కుంపలియా గ్రామానికి చెందిన సహ చట్టం కార్యకర్త అమరా రామ్​ గోదారాను అపహరించి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Attack on RTI activists
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరా రామ్​

బాధితుడు అమరా రామ్​ గోదారా ఆర్​టీఐ కార్యకర్త.. తమ ప్రాంతంలోని లిక్కర్​ మాఫియాపై పలు సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ పంచాయతీలో జరిగే కుంభకోణాలపై ప్రశ్నించే వారు. మంగళవారం సాయంత్రం.. జోధ్​పుర్​ వెళ్లి స్వగ్రామానికి తిరి వచ్చిన క్రమంలోనే కొందరు దుండగులు ఆయన్ను అపహరించి.. దారుణంగా కొట్టారు.

Attack on RTI activists
బాధితుడి వీపుపై గాయాలు

గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న అమరా రామ్​ను గుర్తించిన గ్రామస్థులు.. జోధ్​పుర్​లోని ఎండీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Attack on RTI activists
దాడిలో తీవ్రంగా గాయపడిన అమరా రామ్​

నాలుగు బృందాలు ఏర్పాటు..

' బాఢ్​మేర్​ జిల్లాలోని గిదా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈనెల 21న ఆర్​టీఐ కార్యకర్తపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం జోధ్​పుర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్​టీఐ ద్వారా అతను పోలీసులు, ఇతరులకు సమాచారం ఇచ్చాడు. అందువల్లే ఇలా చేశారని భావిస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం. భాడ్​మేర్​ అదనపు ఎస్పీ బాధితుడి వద్దకు వెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటాం.'

- జిల్లా ఎస్పీ దీపక్​ భార్గవ

దాడి వెనక మాజీ సర్పంచ్..

తనపై జరిగిన దాడి వెనక కుంపలియా మాజీ సర్పంచ్​ నాగరాజ్ ఉన్నాడని బాధితుడు ఆరోపించారు. పరేవు లిక్కర్​ కాంట్రాక్టర్​ సైతం ఉన్నట్లు చెప్పారు. ఎన్​ఆర్​ఈజీఏ రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమాచారం కావాలని ఆర్​టీఐ దరఖాస్తు చేయటం వల్ల తనపై కోపం పెంచుకున్నారని.. గత మంగళవారం జోధ్​పుర్​ నుంచి గ్రామానికి చేరుకున్న క్రమంలో బస్సు దిగగానే అపహరించారని చెప్పారు. తీవ్రంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు గోదారా. రెండు కాళ్లపై మూడు మేకులు కొట్టారని చేప్పారు.

Attack on RTI activists
కాళ్లకు మేకులు దింపిన దుండగులు

" దుండగులు గుర్తు పట్టకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. తీవ్రంగా కొట్టాక.. చనిపోయినట్లు భావించి​న దుండగులు నాగరాజ్​కు ఫోన్​ చేసి మిషన్​ పూర్తయిందని చెప్పారు. ఆ తర్వాత నన్ను వదిలి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గిఢా పోలీస్​ స్టేషన్​ అధికారి, సిబ్బంది సైతం నేరస్థులకు కొమ్ముకాస్తున్నారు. వారి కనుసన్నల్లోనే అక్రమ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారి ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. బాఢ్​మేర్​ ఎస్పీ మాత్రమే దీనిపై దర్యాప్తు జరపగలరు."

- అమరా రామ్​ గోదారా, బాధితుడు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గోదారా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్​ చౌదరి. మరోవైపు.. మాజీ సర్పంచ్​తో తమకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బాధితుడి కుటుంబ సభ్యులు.

దాడిపై ముందు రోజే..

దాడి జరగడానికి ఒక రోజు ముందే తనకు ప్రాణహాని ఉందని అమరా రామ్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే.. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించటం గమనార్హం. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని రాసుకొచ్చారు రామ్​.

రంగంలోకి రాష్ట్ర మానవ హక్కుల సంఘం

ఆర్​టీఐ కార్యకర్తపై దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. డీజీపీ, బాఢ్​మేర్​ జిల్లా కలెక్టర్​, అబ్కారీ శాఖ కమిషనర్​, జిల్లా ఎస్పీలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆర్​టీఐ కార్యకర్తల దేనిపై ఫిర్యాదు చేశారో చెప్పాలని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని స్పష్టం చేసింది. అలాగే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పేర్కొంది.

రాజకీయ దుమారం..

ఆర్​టీఐ కార్యకర్తపై దాడి రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్​ చేసింది. రాజస్థాన్​ను నేటికీ మొఘలులు పాలిస్తున్నారని దుయ్యబట్టారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్​ పూనియా. అక్రమ లిక్కర్​ విక్రయాలపై ప్రశ్నించినందుకే ఆర్​టీఐ కార్యకర్తని తీవ్రంగా హింసించారని ట్వీట్​ చేశారు రాజసమంద్​ ఎంపీ దియా కుమారి.

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్.. కాళ్లు, చేతులు నరికి...

Last Updated :Dec 23, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.