ETV Bharat / bharat

సాగు చట్టాలే కాదు.. మోదీ సర్కార్ 'పట్టువిడుపులు' ఎన్నో!

author img

By

Published : Nov 20, 2021, 11:14 AM IST

pm modi farm laws
pm modi farm laws

వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (Farm Laws repeal) కేంద్రం ప్రకటించింది. గతంలోనూ అనేక బిల్లులు, చట్టాలు, విధాన నిర్ణయాలపై మోదీ సర్కారు (PM Modi news) వెనక్కి తగ్గింది. టీకాల సేకరణ, ఈపీఎఫ్ చట్టం, ఉపాధి హామీ చట్ట సవరణ వంటి అంశాలపై ముందుగా తీసుకున్న నిర్ణయాలను విరమించుకుంది.

దేశ రాజధానిలో ఏడాది కాలంగా రైతులు పట్టువిడవకుండా జరిపిన పోరాటానికి తలొగ్గి మోదీ సర్కారు (PM Modi news) మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు (Farm Laws repeal) చేసింది. అయితే మోదీ ప్రభుత్వం చట్టాలకు సంబంధించి తన నిర్ణయాలను ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో గతంలోనూ కొన్ని చట్టాలు, బిల్లులపై వెనక్కి తగ్గింది. వాటిలో మచ్చుకు కొన్ని..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం

ఈ చట్టాన్ని సవరించి 200 వెనుకబడిన జిల్లాలకే పరిమితం చేయాలని 2014లో మోదీ సర్కారు నిర్ణయించింది. పనివారు, సామగ్రి నిష్పత్తినీ తగ్గించింది. దీనివల్ల చట్టం పరమార్థం దెబ్బతింటుందని 29 మంది ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభ్యంతరపెట్టారు. అవినీతిని తగ్గించి, స్త్రీలు, దళితులు, ఆదివాసీలకు మేలు చేసి, ఉత్పాదక ఆస్తులను సృష్టించిన ఈ చట్టాన్ని నీరుగార్చరాదని ఒత్తిడి తెచ్చారు. సర్కారు సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే విరమించింది.

ఎల్‌.ఏ.ఆర్‌.ఆర్‌(లార్‌) చట్టం

భూసేకరణ, పునరావాస (లార్‌) చట్టం సవరణ బిల్లును 2015లో ప్రవేశపెట్టింది. దీన్ని అన్నా హజారే, రైతులు, పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలే కాకుండా శివసేన, అకాలీ దళ్‌ వంటి మిత్ర పక్షాలూ వ్యతిరేకించాయి. బిహార్‌ ఎన్నికలకు ముందు సంబంధిత ఆర్డినెన్స్‌కు కాలం తీరిపోయినట్లు సర్కారు ప్రకటించింది.

పశువుల విక్రయంపై నిషేధం

పశువుల చోరీనీ, పశు అక్రమ వ్యాపారాన్నీ అరికట్టే పేరుతో 2017లో జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టం కింద కొత్త నిబంధనలను తెచ్చింది. పశువులను కబేళాలకు తరలించకుండా ఇవి నిషేధిస్తాయి. ఈ నిబంధనలు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, మేఘాలయ నిరసించాయి. కేరళ, కర్ణాటకల్లో గొడ్డు మాంసం వేడుకలు నిర్వహించారు. కొత్త నిబంధనలపై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు దేశమంతటికీ విస్తరించింది. రాష్ట్రాలతో చర్చించిన మీదట కేంద్రం నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018 ఏప్రిల్‌లో కొత్త నిబంధనలు రూపొందించింది.

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు

బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల్లో దివాలా కేసుల పరిష్కారానికి 2017 ఆగస్టులో కేంద్రం లోక్‌సభలో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రవేశపెట్టింది. దివాలా కేసులు పరిష్కారం కాకపోతే డిపాజిట్‌ దారులు కొంత భారాన్ని భరించాలన్నది బిల్లు ఉద్దేశం.దీన్ని ప్రతిపక్షాలతోపాటు బ్యాంకు ఉద్యోగుల సంఘం, అసోచామ్‌ వ్యతిరేకించాయి. బిల్లును సమగ్రంగా సమీక్షించాల్సి ఉందంటూ కేంద్రం దాన్ని ఉపసంహరించింది.

సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్‌ హబ్‌

ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో సమాచారంపై నిఘాకు సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2018 ఏప్రిల్‌లో అనుమతి కోరింది. దీనివల్ల పౌరుల ఆన్‌లైన్‌ సంభాషణలను ఆలకించి, ఈ-మెయిల్స్‌నూ చూసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. హబ్‌ టెండరును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర సమాచార శాఖకు ఇంటర్నెట్‌ ఫ్రీడం అసోసియేషన్‌ లీగల్‌ నోటీసు పంపింది. ఈ హబ్‌ను సృష్టించడం నిఘా రాజ్యానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హబ్‌ యోచనను కేంద్రం పక్కన పెట్టింది.

ఈపీఎఫ్‌ చట్టం, పీఎఫ్‌ విత్‌డ్రాయల్‌ నిబంధనల సవరణ

రెండు నెలలకు మించి నిరుద్యోగులుగా ఉన్న భవిష్యనిధి (పీఎఫ్‌) సభ్యులు తమ ఖాతాలోని డబ్బునంతటినీ విత్‌డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం 2016 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసించాయి. సవరణ వల్ల తమ పీఎఫ్‌ ఖాతాలో యజమాని వాటా కోరే హక్కును పదవీ విరమణ వయసు (58 ఏళ్లు) పూర్తయ్యేవరకు ఉపయోగించుకునే వీలుండదని వారి ఆందోళన. ఒత్తిడికి తలొగ్గి కేంద్రం సంబంధిత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

కొవిడ్‌ టీకాల సేకరణ విధానం

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక వైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుంటే, మరోవైపు దేశమంతటా వ్యాక్సిన్‌ కేంద్రాల్లో తీవ్ర డోసుల కొరత ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు లోనైంది. 18-44 ఏళ్లవారికి టీకా వేయడానికి 25 శాతం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్‌ తయారీదారుల నుంచి కొనాలని మే 1 నుంచి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కేంద్రమే టీకాలను కొని వ్యాక్సిన్‌ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రతిపక్షాలు తెచ్చిన ఒత్తిడి, ఆ మేరకు సుప్రీంకోర్టు జోక్యం సర్కారును ఇరుకున పెట్టాయి. మోదీ సర్కారు దిగివచ్చి, కేంద్రమే 75 శాతం డోసులను కొని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రకటించింది.

(రామోజీ విజ్ఞాన కేంద్రం(ఆర్​కేసీ) సౌజన్యంతో..)

ఇదీ చదవండి: రైతులోకం సాధించిన చారిత్రక విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.