ETV Bharat / bharat

చట్టాలను తుంగలో తొక్కి.. మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలు

author img

By

Published : Mar 30, 2023, 8:56 AM IST

margadarshi chit fund
margadarshi chit fund

Margadarsi Chit Fund: మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ చర్యలు చేపట్టింది. ఆడిట్‌ సంస్థ.. బ్రహ్మయ్య అండ్‌ కొలో బలవంతంగా సీఐడీ సోదాలకు దిగింది. చట్టాలను తుంగలో తొక్కి.. దర్యాప్తు పేరుతో మార్గదర్శితోపాటు అందులో విధులు నిర్వహించేవారిని, ఖాతాదారులను, దాంతో సంబంధం ఉన్న ఆడిట్‌ కంపెనీలను వేధింపులకు గురిచేస్తోంది.

కొనసాగుతున్న కక్షసాధింపు చర్యలు.. చట్టాలను తుంగలో తొక్కి వేధింపులు

Margadarsi Chit Fund: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. నాలుగైదు నెలలుగా దుష్ప్రచారానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు నమోదు చేస్తూ మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. ఆరు దశాబ్దాలుగా.. మచ్చలేని సేవలందిస్తున్న మార్గదర్శిపై ప్రతికూల ప్రచారంతో బురద జల్లుతూ.. ప్రతిష్ఠను, వ్యాపారాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం కనిపిస్తోంది. అంతేగాకుండా.. తప్పుడు కేసులతో చందాదారుల్లో భయాందోళనలను కలిగించాలన్న లక్ష్యంతో.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ చందాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోగా.. ఒకే రోజు ఒకే ఆరోపణపై కంపెనీకి వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం స్పష్టమవుతోంది.

రకరకాల మార్గాల్లో వేధింపులు.. ఏపీ, తెలంగాణ హైకోర్టులు ఏపీ అధికారులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, మార్గదర్శికి చెందిన సమాచారాన్ని బయటికి వెల్లడిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు, బ్రాంచ్‌లతోపాటు ఛైర్మన్‌, ఎండీలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండగానే.. ఏపీ సీఐడీ రకరకాల మార్గాల్లో వేధింపులకు దిగుతోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లు తేలేదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూ మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఈ చర్యలు చేపట్టామని, చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి పంపి.. మ్యూచువల్‌ ఫండ్‌, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ఏపీ ప్రభుత్వ ప్రధాన వాదన అని, ఒకవేళ చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారులను మోసగించడం కాదని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే.

60 ఏళ్లుగా వ్యాపారం.. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో 108 శాఖల ద్వారా లక్షల మంది చందాదారులు, రూ.10 వేల కోట్ల టర్నోవర్‌తో 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హమని హైకోర్టు పేర్కొంది. మూడు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండటంతో భిన్నమైన ఉత్తర్వులు వెలువడరాదన్న ఉద్దేశంతో అన్నింటినీ కలిపి విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై గత వారం ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ పిటిషన్‌లు తిరిగి విచారణకు రాకముందే మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని మార్గదర్శి యాజమాన్యం మంగళవారమే సీఐడీకి సమాధానం ఇచ్చింది.

తెల్లవార్లూ సోదాలు.. మార్గదర్శి వ్యవహారాలను చూసే ప్రముఖ ఆడిట్‌ సంస్థ బ్రహ్మయ్య అండ్‌ కొలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మార్గదర్శికి చెందిన సమాచారాన్ని అందజేయాలని సీఐడీ ఈ నెల 27న ఆడిట్‌ కంపెనీకి ఈమెయిల్‌ పంపింది. ఈ నెల 28న ఆడిట్‌ కంపెనీకి చెందిన శ్రావణ్‌ విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయనను, ఆయనతోపాటు ఉన్న ఉద్యోగులను కార్యాలయం దాటివెళ్లకుండా అధికారులు నిర్బంధించారు. కాగా హైదరాబాద్‌లో ఉన్న బ్రహ్మయ్య అండ్‌ కొ సోదా నోటీసులను తీసుకోవడానికి నిరాకరించినా బలవంతంగా తనిఖీలు చేపట్టి, సమాచారాన్ని కాపీ చేసుకున్నారు. దాదాపు 30 మంది అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి.. ఇంటర్నెట్‌, సి.సి.కెమెరాల కనెక్షన్లను కత్తిరించి, సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని తెల్లవార్లూ సోదాలు నిర్వహించారు. బ్రహ్మయ్య అండ్‌ కొ సీనియర్‌ పార్ట్‌నర్‌ 75 ఏళ్ల వయసున్న ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావుని నిర్బంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శికి చెందినదే కాకుండా ఇతర సంస్థలకు చెందిన సమాచారాన్ని కాపీ చేసుకుని తీసుకెళ్లారు.

చట్టాలను తుంగలో తొక్కి.. ఏదైనా కంపెనీకి చెందిన సమాచారాన్ని ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ చట్టం నిబంధనల మేరకే వెల్లడించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ఆడిట్‌ కంపెనీ వద్ద ఉన్న ఖాతాదారులకు చెందిన విశ్వసనీయ సమాచారాన్ని సీఐడీ తీసుకెళ్లింది. ఇది సమాచార తస్కరణ కిందికే వస్తుందని న్యాయనిపుణుల అభిప్రాయం. చట్టప్రకారం అడిగిన సమాచారం అందించకపోతే సోదాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నోటీసులో అడిగిన సమాచారం బ్రహ్మయ్య అండ్‌ కొ విజయవాడ వెళ్లి ఇచ్చినప్పటికీ బలవంతంగా సోదాలకు దిగింది. వాస్తవానికి చిట్‌ఫండ్‌ కంపెనీల చట్టం కింద నడిచే సంస్థలపై ఏపీ డిపాజిటర్స్‌ చట్టం కింద చర్యలు చేపట్టడం చెల్లదు. అయినా ఖాతాదారుల పరిరక్షణ పేరుతో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. చట్టాలను తుంగలో తొక్కి.. దర్యాప్తు పేరుతో మార్గదర్శితోపాటు అందులో విధులు నిర్వహించేవారిని, ఖాతాదారులను, దాంతో సంబంధం ఉన్న ఆడిట్‌ కంపెనీలను వేధింపులకు గురిచేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.