ETV Bharat / bharat

బిహార్‌ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్​ బంగాల్​!

author img

By

Published : Nov 15, 2020, 7:12 AM IST

భాజపా జోరుమీదుంది ! అడ్డంకులను అధిగమించి బిహార్‌లో తిరిగి గెలవడం కమలం పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. బిహార్‌లో భాజపా-జేడీయూ కలయికలోని ఎన్డీఏ.. గెలుపు వ్యూహాలతో పట్నా పీఠాన్ని మరోసారి దక్కించుకుంది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బంగాల్​పై కన్నేసింది కమల దళం. ఈ నేపథ్యంలో భాజపా తదుపరి లక్ష్యం బంగాల్‌ పీఠం దక్కించుకోవటమే !

BJP sets eye on Bengal
బిహార్‌ విజయోత్సాహంతో.. బంగాల్‌పై కన్నేసిన భాజపా !

వచ్చే ఏడాది జరగనున్న బంగాల్‌ ఎన్నికలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. 'దీదీ'ని గద్దె దించటమే లక్ష్యంగా కొన్నాళ్లుగా వ్యుహరచన చేస్తున్న భాజపా శ్రేణులకు.. పక్కనే ఉన్న బిహార్‌లో పార్టీ తిరిగి అధికారం వశం చేసుకోవటం కొత్త బలాన్నిచ్చింది. అదే ఉత్సాహంతో బంగాల్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

బిహార్‌ విజయం వచ్చే ఏడాది బంగాల్‌ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

''ప్రస్తుతం పార్టీ పూర్తిగా పశ్చిమ్​ బంగా‌పై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర నాయకత్వం సైతం బంగాల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒక్కో రాష్ట్రంలో ఎన్నిక ఒక్కోలా ఉంటుందన్నమాట వాస్తవమే. అయితే, బిహార్‌ విజయం బంగాల్‌ ఎన్నికలకు ముందు చోదకశక్తిలా పనిచేస్తుంది. తృణమూల్‌ను ఓడించేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు. వారి శ్రమ సానుకూల ఫలితాలు అందిస్తుంది.''

- దిలీప్‌ ఘోష్‌, బంగాల్‌ భాజపా అధ్యక్షుడు

BJP sets eye on Bengal
దిలీప్‌ ఘోష్‌

కమలానికి కలవరం..

అయితే, బిహార్‌లో ప్రతిపక్షాలు బాగా పుంజుకోవడం.. కాంగ్రెస్‌, వామపక్షాల అభ్యర్థులు చాలాచోట్ల తక్కువ తేడాతో ఓటమి పాలవ్వటం కమలం పార్టీని కాస్త కలవరానికి గురి చేస్తోంది. బిహార్‌లో మహాకూటమి స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా, విజయవంతం అవ్వటం.. బంగాల్‌లోనూ కాంగ్రెస్‌-వామపక్షాల పొత్తుకు బలం చేకూరుస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

బంగాల్‌ కాంగ్రెస్‌ నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకే భాజపా-తృణమూల్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. ఇది తమకు కలిసొస్తుందని చెబుతున్నారు.

''ఇప్పటికీ కాంగ్రెస్‌-వామపక్షాలు బలమైన బంధాన్నే కలిగి ఉన్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నాం. త్వరలో రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకుంటాం.''

- అబ్దుల్‌ మన్నన్‌, కాంగ్రెస్‌ నేత

BJP sets eye on Bengal
అబ్దుల్‌ మన్నన్

కాంగ్రెస్‌-వామపక్షాల ప్రణాళికలు

అదే సమయంలో పొత్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌-వామపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

''వచ్చే ఏడాది ఎన్నికల్లో.. వామపక్షాలు-కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని పూర్తి విశ్వాసం ఉంది.''

- బిమన్‌ బోస్‌, సీపీఎం నేత

ఓవైసీ ప్రభావం

అయితే, తృణమూల్‌ సహా కాంగ్రెస్‌-వామపక్షాలను కలవరపెడుతున్న అంశం.. అసదుద్దిన్‌ ఓవైసీ.

ఓవైసీ పార్టీ పరోక్షంగా బిహార్‌లో భాజపాకు భారీగా లాభం చేకూర్చింది. మైనార్టీల ఓట్లు చీల్చి కమలం నెత్తిన పాలుపోసింది. బంగాల్‌లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటం.. మైనార్టీలు ఎక్కువగా ఉండే మాల్డా, ముర్షిదాబాద్‌ జిల్లాల్లో వారి మద్దతు చీలి భాజపాకు మేలు జరిగే అవకాశముంది.

ప్రస్తుతానికి ఈ అంశంపై పార్టీలు పెద్దగా దృష్టి సారించట్లేదు. ఓవైసీ ప్రభావం గురించి ఎక్కడా నోరు జారట్లేదు. తృణమూల్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరోసారి గద్దెనెక్కుతామనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

''బెంగాలీల మనస్తత్వం బిహారీలకు భిన్నంగా ఉంటుంది. తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు మతాలకు అతీతంగా ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. రాజకీయ అవగాహన ఉన్న బెంగాలీ ఓటర్లు ఎప్పుడూ ప్రభుత్వ పనితీరుని బట్టే ఓట్లు వేస్తారు. వచ్చే ఏడాది సైతం అదే జరుగుతుంది.''

- శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్‌, తృణమూల్‌ నేత

మరోవైపు బిహార్‌ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో వామపక్షాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. 29 స్థానాల్లో పోటీ చేసి 16 సీట్లు దక్కించుకోవటం వారిలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఈ జోష్‌తోనే బంగాల్‌ ఎన్నికల్లో అద్భుతం సృష్టించాలని ఆరాటపడుతున్నారు కామ్రేడ్లు. ఈ నేపథ్యంలో తృణమూల్-భాజపాల మధ్య రగులుతున్న రాజకీయాలతో లాభపడాలని కాంగ్రెస్, కామ్రేడ్లు చూస్తున్నారు. పొత్తులో సీట్లు పంపకం ఇతర అంశాలపై ఆచితూచి అడుగులేయాలనే నిర్ణయానికొచ్చాయి.

భాజపా దూకుడు

అయితే, భాజపా మరింత దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బంగాల్‌లో సానుకూల పవనాలు వీస్తున్నట్లు వస్తున్న నివేదికలతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో ఉరకలేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తృణమూల్‌తో ఢీ కొడుతునే.. కాంగ్రెస్‌-వామపక్షాలను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు కమలం పెద్దలు. దీదీని గద్దెదించి.. బంగాల్‌లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. బిహార్‌ విజయం భాజపాకు అగ్నికి ఆయువులా తోడవ్వనుంది.

ఇదీ చూడండి: 'పద్ధతి మార్చుకోకపోతే నేరుగా శ్మశానానికే!'

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: కమలనాథుల కల నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.