ETV Bharat / bharat

తప్పతాగి విమానంలో హల్​చల్.. వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి.. DGCA సీరియస్!

author img

By

Published : Jan 4, 2023, 12:17 PM IST

Updated : Jan 4, 2023, 1:10 PM IST

man pees on woman
man pees on woman

అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా వ్యవహరించాడు. బిజినెస్ క్లాస్​ సీటులో కూర్చున్న ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటనను తీవ్రంగా ఆక్షేపిస్తూ బాధితురాలు టాటా గ్రూప్ ఛైర్మన్​కు లేఖ రాశారు.

ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. న్యూయార్క్- దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైట్​లో తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రం పోశాడు. నిందితుడు మద్యం మత్తులో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ స్పష్టం చేసింది.

గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్​లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం.. దిల్లీకి బయల్దేరింది. మార్గమధ్యలో బిజినెస్ క్లాస్ సీట్​లో కూర్చున్న 70ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆ వ్యక్తిని ఎయిర్ఇండియాలో ప్రయాణించకుండా 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని కమిటీ సిఫార్సు చేసిందని అధికారులు తెలిపారు.

"ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. డీజీసీఏకు వివరాలు సమర్పించాం. విచారణ సమయంలో బాధిత ప్రయాణికురాలు, ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపాం" అని ఎయిర్ఇండియా ప్రతినిధి తెలిపారు. నిందితుడిపై నియంత్రణ సంస్థతో పాటు పోలీసులు సైతం తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

బాధితురాలి లేఖ
కాగా, ఈ ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ ఛైర్మన్ కే చంద్రశేఖరన్​కు ఫిర్యాదు చేశారు. తనకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతూ లేఖ రాశారు. "లంచ్ పూర్తైన తర్వాత లైట్లు ఆర్పేశారు. పూర్తిగా మత్తులో ఉన్న ప్యాసింజర్ నా సీటు వద్దకు వచ్చి మూత్రం పోశాడు. తన ప్రైవేటు భాగాలను చూపిస్తూ అక్కడే నిల్చున్నాడు. నా సహ ప్రయాణికులు గట్టిగా అడిగిన తర్వాతే అతడు అక్కడి నుంచి కదిలాడు. నా బట్టలు, షూ, బ్యాగు మొత్తం మూత్రంలో తడిసిపోయాయి. సిబ్బంది ఇచ్చిన పైజామా వేసుకొని 20 నిమిషాల పాటు టాయిలెట్ వద్దే ఉండిపోయా. తర్వాత నాకు ఇరుకైన సీటు ఇచ్చారు. అరగంట అక్కడ కూర్చున్న తర్వాత మళ్లీ నా సీటు వద్దకు వెళ్లాలని అన్నారు. ఫస్ట్ క్లాస్​లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా.. రెండు గంటల పాటు నాకు వేరే సీటు ఇవ్వలేదు. అప్పటివరకు నేను ఆ మూత్రం పోసిన సీటు వద్దే కూర్చున్నా. కస్టమ్స్​ చెక్ త్వరగా పూర్తిచేసుకునేలా ఫ్లైట్ దిగిన తర్వాత నాకు వీల్​చైర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి వెయిటింగ్ ఏరియాలో వదిలేశారు. 30 నిమిషాలు అక్కడే వెయిట్ చేశా. ఎవరి సాయం లేకుండానే నా లగేజ్ తీసుకున్నా. కస్టమ్స్ చెక్ పూర్తి చేసుకున్నా. ఆ బాధాకరమైన పరిస్థితుల్లో సిబ్బంది సరిగా వ్యవహరించలేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. సిబ్బంది స్పందించేందుకు చాలా సేపు వేచి చూడాల్సి వచ్చింది. ఘటన సమయంలో నన్ను సౌకర్యవంతంగా చేసేందుకు సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరం" అని తన లేఖలో పేర్కొన్నారు.

Last Updated :Jan 4, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.