ETV Bharat / bharat

నెరవేరిన 'బామ్మ' కల.. 75 ఏళ్ల తర్వాత స్వదేశానికి!

author img

By

Published : May 18, 2022, 10:45 PM IST

Pune old lady will visit Pakistan: అప్పుడెప్పుడో అల్లర్లకు భయపడి 1947లో పాకిస్థాన్​ నుంచి ఇండియా వచ్చేసిన ఓ బామ్మ కోరిక నెరవేరనుంది. పుణెలో నివసిస్తున్న రీనా వర్మ సుమారు 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన వీసా కూడా మంజూరైంది. అసలు ఈ బామ్మ ఎవరు? ఎప్పుడు వెళుతున్నారు? వీసా ఎందుకు ఆలస్యమైందో? తెలుసుకుందాం..

రీనా వర్మ
రీనా వర్మ

Pune old lady will visit Pakistan: బాలీవుడ్​ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'బజరంగీ భాయిజాన్​' సినిమా ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలోని మున్నీ అనే పాప చిన్నవయసులోనే కొన్ని కారణాల వల్ల ఇండియాకు వచ్చేస్తుంది. భారత్​ నుంచి ఆమెను పాకిస్థాన్‌కు తిరిగిపంపే ప్రయత్నాలు జరుగుతాయి. చివరకు సినిమాలో మున్నీ పాక్​కు చేరుకుంటుంది. అలాంటి కోవకు చెందినా వారే రీనా వర్మ.

1947, మే నెలలో, 15 ఏళ్ల రీనా వర్మ.. అల్లర్లకు భయపడి పాకిస్థాన్‌ రావల్పిండి, ప్రేమ్ స్ట్రీట్‌లోని తన ఇంటిని విడిచిపెట్టి భారత్​ చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె తోబుట్టువులు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌కు బయలుదేరారు. అల్లర్లు సద్దుమణగగానే వారికి రీనా ఇంటికి తిరిగి వస్తానని చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల అలా జరగలేదు. అయితే ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత.. రీనా పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న తన ఇంటికి వెళ్లనున్నారు.

రీనా వర్మ
రీనా వర్మ

నెరవేరనున్న బామ్మ కల.. ప్రస్తుతం రీనా వయసు 90 ఏళ్లు. చర్మంపై ముడతలు వేలాడుతున్నా, మళ్లీ సొంత ఇంటిని చూస్తాననే ఆనందంతో ఆమె ముఖం ప్రకాశవంతంగా వెలుగుతోంది. రావల్పిండిలో ఇల్లు చూడాలన్న రీనా కల నెరవేరనుంది. గురుగ్రామ్​లో నివసిస్తున్న రీనా కుమార్తె సోనాలీ గత ఏడాది 90 రోజుల వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేసింది. అయితే, రీనా దరఖాస్తు తిరస్కరణకు గురైంది.

ఓ జర్నలిస్ట్ సహాయంతో.. బజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీకి పాకిస్థాన్ చేరుకోవడానికి ఒక జర్నలిస్ట్ సహాయం చేసినట్లే, ఈ మున్నీకి కూడా పాకిస్థాన్‌లోని తన ఇంటికి వెళ్ళడానికి ఒక జర్నలిస్ట్ సహాయం చేశారు. రీనా ఓ పాకిస్థాన్ జర్నలిస్టును సంప్రదించి ఓ వీడియో చేశారు. ఆ వీడియో పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్​కు చేరింది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి మొదలైనప్పుడు, తమ చిన్ననాటి ఇంటి జ్ఞాపకాలను చూడాలనే కోరికను ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు రీనా. పుణెకు చెందిన ఈ బామ్మ కథ రావల్పిండికి చెందిన సజ్జాద్ దృష్టిని ఆకర్షించింది. రీనా ఇంట్లో సోదాలు చేసి ఆమె ఫొటోలు, వీడియోలు పంపించారు. ఈ వ్యవహారమంతా పాక్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ దృష్టికి చేరింది. దీంతో రీనాకు 90 రోజుల వీసాను మంజూరు చేశారు మంత్రి హీనా.

జులైలో వెళ్లాలని యోచిస్తున్న బామ్మ.. రావల్పిండిలోని తన ఇంటికి వెళ్లడం పట్ల రీనా చాలా సంతోషంగా ఉన్నారు. "మీ ఇంట్లో ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు?" అని ఆమెను ఓ విలేకరి అడిగగా.. "నాకు తెలియదు. కానీ, వారు నన్ను ఆ ఇంటిని చూసేందుకు అనుమతిస్తారని నేను ఆశిస్తున్నాను." అని రీనా చెప్పారు. రీనా జులైలో రావల్పిండి వెళ్లాలని యోచిస్తున్నారు. అక్కడ ఆమె ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అయిన వ్యక్తులందరినీ కలవబోతున్నారు.

ఇవీ చదవండి: 'ఈ-జీప్'​ సూపర్.. రూ.5 ఖర్చుతో 70 కిలోమీటర్ల మైలేజీ!

'ధరల భూతంపై 'డైవర్షన్​' రాజకీయం'.. కేంద్రంపై విపక్షాల ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.