ETV Bharat / bharat

నేరం చేసిన 28 ఏళ్లకు అరెస్ట్ వారెంట్.. 83 ఏళ్ల వృద్ధుడికి కోర్టు సమన్లు

author img

By

Published : Jun 29, 2023, 6:30 PM IST

Updated : Jun 29, 2023, 6:47 PM IST

1994లో చేసిన నేరానికి 2023లో కోర్టు నుంచి సమన్లు అందుకున్నాడు ఓ వ్యక్తి. జులై 17న కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసులో ఉంది. ప్రస్తుతం అతను పెరాలసిస్‌తో బాధపడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

83-year-old-man-received-arrest-warrant-from-court-for-28-years-of-committing-crime
నేరం చేసిన 28 ఏళ్లకు కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ అందుకున్న 83 ఏళ్ల వృద్ధుడు

ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 1994లో ఓ ప్రమాదానికి కారణమైన వ్యక్తి.. 2023లో కోర్టు నుంచి సమన్లు అందుకున్నాడు. అప్పట్లో బస్సు డ్రైవర్​గా పనిచేసిన ఆ వ్యక్తి.. బ్రేకులు పనిచేయక ఓ గేదెను ఢీకొట్టాడు. దీంతో ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం బస్సు డ్రైవర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆ వృద్ధుడి పేరు అచ్చన్​. ప్రస్తుతం అతని వయస్సు 83 ఏళ్లు. బారాబంకీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1994లో బస్సు నడుపుతూ అనుకోకుండా గేదెను ఢీకొట్టాడు. ఘటనపై అప్పట్లో పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్‌ కేసు కూడా నమోదైంది. రాజధాని లఖ్‌నవూలో ఘటన జరిగింది. అనంతరం అచ్చన్​ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అచ్చన్​ వెంటనే బెయిల్​ కూడా పొందాడు. కాకపోతే తిరిగి ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అచ్చన్​కు సమన్లు జారీ చేసింది కోర్టు. జులై 17న తమ ముందు హాజరుకావాలని తెలిపింది.

83-year-old-man-received-arrest-warrant-from-court-for-28-years-of-committing-crime
అచ్చన్

సోమవారం ఉదయం ఉన్నట్టుండి అతడి ఇంటికి వచ్చి.. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పంపించిన సమన్లు అందజేశారు పోలీసులు. దీంతో షాక్ తిన్న ఆ వృద్ధుడు పోలీసులపై మొదట విరుచుకుపడ్డాడు. దానికి ఎలా స్పందించాలో అర్థంకాని పోలీసులు.. అచ్చన్​ను కోర్టుకు హాజరు కావాలన్నారు. లేకపోతే చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

"నేను రెండు దశాబ్దాల క్రితం ఒక బస్సు నడిపేవాడిని. ప్రస్తుతం పదవీ విరమణ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాను. బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగింది" అని వృద్ధుడు తెలిపాడు. తనకు ఈ ఇరవయ్యేళ్లలో రెండు సార్లు సమన్లు అందాయని అతడు వెల్లడించాడు. రెండు సార్లు కూడా బెయిల్ వచ్చిందని అచ్చన్ వివరించారు. ప్రస్తుతం తాను పక్షవాతంతో బాధపడుతున్నానని.. కేసును కొట్టివేయాలని అచ్చన్ అభ్యర్థిస్తున్నాడు

83-year-old-man-received-arrest-warrant-from-court-for-28-years-of-committing-crime
కోర్టు సమన్లు

కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్​ అందుకున్న అచ్చన్.. కన్నీటి పర్యంతమయ్యాడని పోలీసులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి చూసి తాము కూడా అయోమయంలో పడినట్లు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం జులై 17న అతడు కోర్టుకు హాజరుకావాలని.. లేనిపక్షంలో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వారు వివరించారు.

Last Updated : Jun 29, 2023, 6:47 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.