ETV Bharat / bharat

ఆకస్మిక వరదల బీభత్సం- 12 మంది మృతి!

author img

By

Published : Jul 28, 2021, 7:33 AM IST

Updated : Jul 28, 2021, 12:58 PM IST

ఆకస్మిక వరదల ధాటికి జమ్ము కశ్మీర్​లో ఐదుగురు, హిమాచల్​ప్రదేశ్​లో ఏడుగురు మరణించారు. ఆయా ఘటనల్లో పలువురు ఆచూకీ కోల్పోయారు. వీరిని గుర్తించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు

flash floods due to cloudburst in Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ వరద

భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్​లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. కిష్టావర్ జిల్లాలోని హోంజర్ అనే మారుమూల గ్రామంలో ఈ వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. గ్రామంలో సుమారు తొమ్మిది ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఘటనపై సమాచారం తెలియగానే హుటాహుటిన గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

గల్లంతైన వారిని కాపాడేందుకు సైన్యం, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కిష్టావర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.

మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. అన్ని రకాల సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అవసరమైతే వాయుసేన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్లలో తరలించేందుకు ఎయిర్​ఫోర్స్ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.

హిమాచల్​లో..

అటు.. హిమాచల్​ప్రదేశ్​లోనూ ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి. లాహౌల్-స్పీతి, కులు, చంబ జిల్లాల్లో సంభవించిన వరదల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కులులో 25 ఏళ్ల మహిళ.. తన నాలుగేళ్ల కొడుకుతో బ్రహ్మగంగా నదిలో కొట్టుకుపోయింది. నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం వల్ల.. ఇరువురు ప్రవాహంలో అదుపుతప్పిపోయారు.

హిమాచల్​ప్రదేశ్​లో వరదలు

భారీ వర్షాల కారణంగా లాహౌల్-స్పీతి జిల్లాలో వరద పోటెత్తిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ సుదేశ్ కుమార్ మోఖ్తా తెలిపారు. కూలీలు ఉంటున్న రెండు టెంట్లు, ఓ ప్రైవేటు జేసీబీ వరదలకు కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఓ యువకుడు స్వల్పంగా గాయపడ్డాడని, తొమ్మిది మంది కూలీల ఆచూకీ మాత్రం తెలియలేదని స్పష్టం చేశారు.

దీంతో విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించినట్లు సుదేశ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు, ఐటీబీపీ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్ధృతంగా ఉన్న నీటి ప్రవాహం మంగళవారం రాత్రి సహాయక చర్యలకు అంతరాయం కలిగించిందని చెప్పారు.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో వరద బీభత్సం- 209కి చేరిన మృతులు

Last Updated : Jul 28, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.