మిగిలిన పరిహారమివ్వాలని గండికోట ముంపు వాసుల డిమాండ్
Gandikota Victims Demanded Remaining Compensation: సీఎం జగన్ ఎన్నికల ముందు పరిహారం కింద ఇస్తామన్న మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలంలోని ముంపు బాధితులు జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కేంద్రానికి చేరుకుని ఆర్డీవోతో మాట్లాడారు. సీఎం జగన్ ముంపు బాధితులకు 10లక్షల నష్ట పరిహారం ప్రకటించగా ఇంతవరకు ఆరు లక్షల 75 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని.. మిగిలిన మూడు లక్షల 25 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆరు లక్షల 75 వేల రూపాయలు ఇచ్చే సమయంలో అన్ని ఆధారాలు సమర్పించాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆధారాలు చూపాలనటం న్యాయంగా లేదని బాధితులు వాపోయారు. అలా ఆధారాలు ఇవ్వని సుమారు 400 మంది పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరమూ ముంపు బాధితులమే.. కావున నిబంధనలు పక్కన పెట్టి అందరికీ మిగిలిన పరిహారం అందజేయాలని కోరారు.