'ఒక్క ఛాన్స్' అని అడిగింది మట్టి దొంగలను కాపాడేందుకేనా? - ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై దేవినేని ఫైర్
Devineni Uma Complaint on YCP MLA Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లురులో మట్టి మాఫియా చెలరేగిపోతోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆ మట్టి దొంగలను వెంటనే అరెస్టు చేయాలని మైలవరం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్ల విలువైన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు.
పుల్లూరు గ్రామస్థులు మట్టితోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారన్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుల మట్టి దోపిడీ రఘురాం రెడ్డికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అని ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.. ఇంకా తన అనుచరులతో గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు.