ETV Bharat / state

చీటీల పేరుతో లక్షల్లో మోసం.. ఆగిన బాధితుడి గుండె

author img

By

Published : Mar 20, 2023, 8:26 PM IST

Chit fraud
చిట్టీల మోసం

Chit Scam in Kadapa: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసు చూడు అంటారు అందరూ.. ఎందుకంటే ఎవరికైనా ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అందరూ ఇంటి కోసం, బిడ్డ పెళ్లి కోసం ప్లానింగ్​ చేసుకుంటారు. పైసా పైసా కూడబెడుతుంటారు. కానీ ఇలాంటివాళ్లనే నమ్మించి మోసం చేసేవాళ్లు ఉంటారు. అలాంటి ఘటనే కడపలో జరిగింది. ఈ బాధను తట్టుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు.

Chit Scam in Kadapa: తన కుమార్తె పెళ్లి కోసం చీటీల రూపంలో దాచుకున్న డబ్బుతో నిర్వాహకులు లక్ష్మీదేవి, సిద్ధయ్య దంపతులు ఉడాయించడంతో ఓ విశ్రాంత ఉద్యోగి గుండె ఆగింది. కడప మన్సిపల్ కార్యాలయం విశ్రాంత ఉద్యోగి నారాయణ.. శంకరాపురంలోని లక్ష్మీదేవి, సిద్ధయ్య దంపతుల వద్ద రెండేళ్ల నుంచి చీటీలు వేస్తున్నాడు. ఈ లెక్కన ఆయనకు 13 లక్షల రూపాయలు రావాల్సి ఉంది.

అయితే వారం రోజుల నుంచి చీటీల నిర్వాహకులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ లోపే మనస్తాపం చెందిన నారాయణ.. ఇవాళ ఉదయం గుండెపోటుతో చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో శంకరాపురంలోని చీటీల నిర్వాహకురాలు.. లక్ష్మీదేవి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

డబ్బులు చెల్లించేవరకు కదిలే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న మరికొంతమంది బాధితులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని.. తమ మద్దతు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. డబ్బులు వసూలు చేసుకోవడం ఈ విధంగా కాదని.. వెంటనే మృతదేహాన్ని ఇంటివద్ద నుంచి తీసుకెళ్లాలని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి హెచ్చరించారు. దీంతో బాధితులు నారాయణ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. చీటీల నిర్వాహకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

చీటీల పేరుతో లక్షల్లో మోసం.. మనస్తాపంతో మృతి చెందిన బాధితుడు

"రెండేళ్ల నుంచి చీటీ వేస్తున్నాం. 13 లక్షల డబ్బులు. ఆయన దాని వలనే చనిపోయారు. పోలీసులకు చెప్పాం. కేసు పెట్టినాం సర్. వస్తాదిలే.. వస్తాదిలే అంటున్నారు. నా పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు డబ్బులు కావాలి". - రాజేశ్వరి, నారాయణ భార్య

"నాకు చీటీ డబ్బులు 8 లక్షల వరకూ ఇవ్వాలి. డిసెంబర్​కి చీటీ ఎండింగ్ అయిపోయింది. మొత్తం 20 నెలల చీటీ. నెల నెలా డబ్బులు తీసుకున్నారు. మా చీటీ అయిపోయిందని డబ్బులు అడిగినాము. సంక్రాంతి అయిపోయిన తరువాత ఇస్తాం అన్నారు. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది". - వెంకటేశ్, బాధితుడు

"శంకరాపురంలో నారాయణ అనే వ్యక్తి ఈ రోజు మరణించాడు. ఇతను గతంలో చీటీల విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. లక్ష్మీదేవి అలియాస్ ఎల్లమ్మ, సిద్ధయ్య, రాజా, శశికళ అనే వాళ్లు చీటీలు నిర్వహిస్తున్నారు. అనధికారికంగానే నిర్వహిస్తున్నారు. వాళ్ల దగ్గర చీటీలు పెట్టి మోసపోయామని కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేశాం. విచారణ చేస్తున్నాం. రాజా, శశికళను అరెస్టు కూడా చేశాం. లక్ష్మీదేవి అలియాస్ ఎల్లమ్మ, సిద్ధయ్య పరారీలో ఉన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు.. సుమారు 50 లక్షలు ఉండొచ్చు". - శ్రీరాం శ్రీనివాస్, సీఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.