ETV Bharat / state

Property Tax: పట్టణ ప్రజలపై పన్ను బాదుడు.. ఏటా 10-15 % చొప్పున పెరుగుదల

author img

By

Published : Apr 26, 2023, 7:37 AM IST

Tax Based on the Capital Value of the Property: ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 10-15శాతం చొప్పున పెంపుతో.. పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మూడు సంవత్సరాలలో దాదాపు 660కోట్ల రూపాయల అదనపు భారం పడింది. పన్ను వసూళ్లలోనూ.. పట్టణ ప్రజలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. కొత్త ఆస్తి పన్ను విధానం వల్ల.. పట్టణ ప్రజలు కొన్నాళ్లకు ఇళ్లు అమ్ముకోవాల్సి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Property Tax
Property Tax

పట్టణ ప్రజలపై పన్ను బాదుడు.. ఏటా 10-15 % చొప్పున పెరుగుదల

Tax Based on the Capital Value of the Property: రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజలపై ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 10నుంచి 15శాతం చొప్పున పెరుగుతోంది. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం 2021-22 నుంచి అమల్లోకి రాగా.. గత మూడు సంవత్సరాలలో ప్రజలపై.. 659కోట్ల 55లక్షల రూపాయల అదనపు భారం పడింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పన్ను చెల్లింపుదారులు, ప్రజాసంఘాలు కొత్త పన్ను విధానాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం అమలు చేసింది.

ప్రధాన నగరాల్లో ఆస్తి పన్ను భారమిలా..: పాత విధానంలో.. వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన 2020-21లో విశాఖలోని సీతమ్మధారలో 950 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్‌కు.. దాని యజమాని 3వేల 834రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఇది 4వేల 410రూపాయలకు పెరిగింది. 2022-23లో 5వేల 072రూపాయలకు పెరగ్గా, 2023-24లో.. 5వేల 534 రూపాయలకు చేరినట్లు నగరపాలక సంస్థ ఆన్‌లైన్‌లో డిమాండ్‌ నోటీస్‌ అప్‌లోడ్‌ చేసింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ల శాఖలోని స్ట్రక్చరల్ భూముల విలువ ప్రకారం ఫ్లాట్‌ విలువ 38లక్షల 80 వేల రూపాయలుగా నగరపాలక సంస్థ నిర్ణయించింది. దీనిపై 0.13%గా నిర్ణయించిన ఆస్తి పన్ను మొత్తంపై.. లైబ్రరీ సెస్సు, ఇతర రుసుముల కింద మరో 8%తో కలిపి వార్షిక పన్ను 10వేల 896 రూపాయలుగా లెక్కకట్టింది. తెలంగాణలో ఆస్తి మూల ధన విలువ ఆధారంగా.. పన్ను విధించే విధానం లేకుండ.. వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్నందున, అక్కడి పట్టణ వాసులపై అదనపు పన్ను బాదుడు లేదు.

విశాఖలోని న్యూ వెంకోజీపాలెంలో ఓ వాణిజ్య భవనానికి మూడు సంవత్సరాలలో.. ఆస్తి పన్ను 20వేల 660 రూపాయలకు పెరిగింది. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం రాకముందు సంవత్సరానికి లక్షా 43వేల 046 రూపాయలు పన్ను చెల్లించేవారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 2021-22లో లక్షా 57వేల 350రూపాయలకు చేరింది. 2022-23లో మళ్లీ లక్షా 60వేల 498 రూపాయలకు పెంచారు. 2023-24లో లక్షా 63వేల 706 రూపాయలకు పెరిగింది. విశాఖలోని ఎంవీపీకాలనీ సెక్టార్‌-8లో ఓ మధ్య తరగతి కుటుంబం నివసిస్తున్న ఇంటికి.. మూడేళ్లలో ఆస్తి పన్ను 2,058 రూపాయలు పెరిగింది. పాత విధానంలో ప్రతి ఏడాది 3,952రూపాయలు చెల్లించేవారు. కొత్త విధానంలో 2021-22లో 4,544రూపాయలకు చేరగా, 2022-23లో 5,226, 2023-24 నాటికి 6,010రూపాయలకు పెంచారు.

గుంటూరులోని అరండల్‌పేటలో ఒక వాణిజ్య భవనానికి మూడేళ్ల క్రితం.. 76వేల 058 చెల్లించిన వార్షిక ఆస్తి పన్ను.. 2023-24 నాటికి 87వేల 44రూపాయలకు పెరిగింది. కొత్త విధానంలో 10వేల 986 రూపాయల భారం పడింది. గోరంట్లలో ఓ ఫ్లాట్‌కు గతంల ఆస్తిపన్ను 2వేల992 రూపాయలు చెల్లించగా, 2021-22లో 3,440, 2022-23లో 3,956రూపాయలకు పెరిగింది. తాజాగా 4వేల 264 రూపాయలకు పెంచారు. మొత్తంగా మూడేళ్లలో 12వందల 72రూపాయల భారం పడింది.

కడపలోని శంకరాపురంలో ఓ ఇంటికి 2021-22కి ముందు ఆస్తి పన్ను.. 4వేల 962 రూపాయలు ఉండగా 2021-22లో 5వేల 706రూపాయలకు చేరింది. 2022-23లో.. 6వేల562కు పెంచారు. తాజాగా 2023-24కి 7,546రూపాయలకు పెరిగింది. మొత్తంగా మూడేళ్లలో 2వేల584 పెరిగింది. ఇదే నగరంలో మద్రాస్‌రోడ్డులో చిన్న దుకాణానికి 2020-21లో 3వేల 202 చెల్లించగా.. కొత్త విధానం అమలయ్యాక గతేడాది 4వేల 234రూపాయలకు పెరిగింది.

విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒక మధ్య తరగతి కుటుంబం.. తమ ఇంటికి పాత విధానంలో ఏటా 992 రూపాయలు ఆస్తి పన్ను చెల్లించేది. 2021-22లో 11వందల 40రూపాయలకు చేరింది. 2022-23లో 13వందల16 రూపాయలు, 2023-24లో 1వెయ్యి 508రూపాయలకు పెంచారు. మూడేళ్లలో 516రూపాయలు పెరిగింది. MG రోడ్డులో ఒక భవనానికి పాత విధానంలో 17వేల 094రూపాయలు చెల్లించగా ఇప్పుడు 23వేల 058రూపాయలు కట్టాల్సి వస్తోంది.

వసూళ్లలోనూ అధికారుల దుందుడుకు చర్యలు: ఆస్తి పన్ను వసూళ్లలోనూ మున్సిపల్‌ అధికారులు ప్రజలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగుల్ని ఇళ్లకు పంపి పన్ను చెల్లించకపోతే ఆస్తులు జప్తుచేస్తామని బెదిరిస్తున్నారు. వీరికి పుర, నగరపాలక సంస్థల్లోని రెవెన్యూ సిబ్బంది తోడవుతున్నారు. వీధుల్లో ఆస్తుల జప్తు వాహనాలను తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటి దుందుడుకు చర్యలకు అధికారులు పాల్పడుతున్నట్లు.. పట్టణవాసులు వాపోతున్నారు.

ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధింపు విధానం ప్రజలకు భారం అవుతోందని.. ఏపీ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు తెలిపారు. ఐదేళ్లలో పన్ను పెరుగుదల 100 శాతానికి చేరుకుంటుందన్నారు. వార్షిక అద్దె ప్రాతిపదికన గతంలో ఐదేళ్లకోసారి పన్నులు సవరించేవారని.. గరిష్ఠంగా 40శాతం పెరిగేదన్నారు. కొత్త విధానం వల్ల పట్టణ ప్రజలు కొన్నాళ్లకు ఇళ్లు అమ్ముకోవాల్సి వస్తుందని పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.