ETV Bharat / state

Narendra Modi: భారత ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యమిస్తాం: ప్రధాని నరేంద్ర మోదీ

author img

By

Published : Nov 12, 2022, 9:10 PM IST

Etv Bharat
Etv Bharat

PM Modi's visit to AP: విశాఖపట్నంలో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ.. రాష్ట్రంలో 10వేల 742 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యమిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి పథకాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందేభారత్‌ రైలు కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ ..ప్రధాని మోదీతో అనుబంధం రాజకీయాలకు అతీతమన్నారు.

విశాఖలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ

Narendra Modi AP Tour: భారత ప్రగతి అధ్యాయంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విశాఖ విశిష్టతను కీర్తించిన ప్రధాని.. తాజా ప్రాజెక్టులు రాష్ట్ర ఆకాంక్షలను నెరవేరుస్తాయని భరోసా ఇచ్చారు. దాదాపు 10 వేల కోట్లతో, విశాఖలో రైల్వేస్టేషన్, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఆధునికీరణతో పాటు.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రులు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారని కితాబిచ్చిన ప్రధాని.. వారి ప్రేమ అసమానమైందంటూ ప్రశంసించారు.


మోదీ ఏపీ పర్యటన: విశాఖపట్నంలో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ... రాష్ట్రంలో 10వేల 742 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఫిషింగ్ హార్బర్ , పోర్టు నుంచి షీలా నగర్ వరకు 6 లేన్ల రహదారి సహా 7 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నుంచి - అంగుల్ కు 745 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, రాయపూర్ - విశాఖ ఎకనామిక్ కారిడార్ లో 6 - లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రాజెక్టు, విశాఖలోని ఎన్​హెచ్-516 సి పై 6 లేన్ల రోడ్డు నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కొన్ని నెలల ముందే విప్లవ వీరుడు అల్లూరి 125 జయంతికి ఏపీకి వచ్చానని, మళ్ళీ అభివృద్ధిలో భాగమయ్యేందుకు ఇక్కడికి రావడం సంతోషం కలిగిస్తోందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

10 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు: విశాఖ దేశంలోనే విశిష్ట నగరం. ప్రాచీన కాలం నుంచీ ఎంతో ప్రాధాన్యమున్న పోర్టు ఉంది. వేల సంవత్సరాల క్రితమే విశాఖ పోర్టు నుంచి పశ్చిమాసియా, రోమ్‌కు వ్యాపారం జరిగేది. ఇప్పుడు కూడా విశాఖ దేశ వాణిజ్యంలో కేంద్ర బిందువుగా ఉంది. రూ.10 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు... ఆంధ్రప్రదేశ్‌, విశాఖ ఆకాంక్షలను నెరవేర్చేందుకు దోహదపడతాయి. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి పథకాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరాం గవర్నర్ హరిబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నా. వారు కలిసినప్పుడల్లా మా మధ్య.. ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి గురించి అనేక చర్చలు, సమాలోచనలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌పై వారి ప్రేమ, అంకితభావం అసమానమైనవి. ఆంధ్ర ప్రజలు చాలా ప్రత్యేకమైనవారు. వారు. స్నేహ స్వభావం కలిగినవారు. నేడు ప్రపంచం నలుమూలలా, అన్ని రంగాల్లోనూ ఆంధ్ర ప్రజలు వారి ప్రతిభను చాటుతున్నారు. విద్యుత్‌, వ్యాపారం, సాంకేతికత, వైద్య వృత్తి.. ఇలా ప్రతి రంగంలోనూ గుర్తింపు పొందుతున్నారు.

'మోదీ నాయకత్వంలో 446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునికీకరించనున్నాం. చాలా చక్కని డిజైన్‌ రూపొందించాం. టెండర్ల ప్రక్రియ పూర్తైంది. పనులు మొదలయ్యాయి. వేగవంతంగా రైల్వేస్టేషన్‌ పనులు పూర్తిచేస్తాం. అంతర్జాతీయ స్థాయి రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపకల్పనకు ప్రధాని మోదీ స్ఫూర్తిగా నిలిచారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందేభారత్‌ రైలు కేటాయిస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. 2014కు ముందు ఉమ్మడి ఏపీకి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించేవారు. ప్రధాని మోదీ ఒక్క నవ్యాంధ్రకే రూ.7,032 కోట్లు ఇచ్చారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులు, గేజ్‌ల మార్పు వంటి పనుల్లో ఇది ప్రతిబింబిస్తోంది. 4,668 గ్రామాలను టెలికాం టవర్లతో అనుసంధానిస్తున్నాం. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకూ అంతర్జాతీయ స్థాయి మొబైల్‌ కనెక్టివిటీ లభించనుంది.'- కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్

మోదీతో అనుబంధం: బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ ..ప్రధాని మోదీతో అనుబంధం రాజకీయాలకు అతీతమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మినహా తమకేమీ అజెండా లేదన్నారు. 8 ఏళ్లుగా విభజన గాయాల నుంచి కోలుకోలేదన్నారు. ప్రత్యేక హోదా , పోలవరం, విభజన హామీలు పరిశీలించి సాయం అందించాలని ప్రధానిని కోరారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీకి శ్రీరాముడి ప్రతిమను సీఎం జగన్ బహూకరించారు. పలువురు నేతలు తమ విజ్ఞప్తులను ప్రధానికి అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.