ETV Bharat / state

CBN Letter to DGP: ఆరుద్రకు తక్షణమే రక్షణ కల్పించండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Jul 17, 2023, 3:25 PM IST

CBN
CBN

Chandrababu letter to DGP: రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో కాకినాడకు చెందిన ఆరుద్రను వేధిస్తున్న కానిస్టేబుళ్ల తీరును ఎండగట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. ఆమెకు రక్షణ కల్పించి, సాయిలక్ష్మీచంద్ర శస్త్ర చికిత్సకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు.

TDP chief Chandrababu letter to state DGP: కాకినాడ రూరల్‌ పరిధిలోని రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్రకు తక్షణమే రక్షణ కల్పించాలంటూ.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ఆరుద్ర బిడ్డ వైద్యం కోసం పడుతున్న వేదనను, ఆస్తి అమ్ముకునే విషయంలో అడ్డుపడుతున్న కానిస్టేబుళ్ల అంశాలతోపాటు మరికొన్ని విషయాలను వివరించారు.

ఆరుద్రకు తక్షణమే రక్షణ కల్పించండి..డీజీపీకి చంద్రబాబు లేఖ

రాష్ట్ర డీజేపీకీ చంద్రబాబు లేఖ.. కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర.. తన బిడ్డ వైద్యం నిమిత్తం సొంత ఆస్తి అమ్ముకునే విషయంలో కొంత కాలంగా పోరాటం చేస్తోందని..చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మి చందన వెన్నెముక సమస్య కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని గుర్తు చేశారు. బిడ్డ వైద్యం కోసం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఉన్న తన ఇంటిని ఆరుద్ర రూ. 40 లక్షలకు విక్రయించాలని చూశారని.. దానిని మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శివ, కన్నయ్య ఆరుద్రను బెదిరించి, ఇంటిని రూ.10 లక్షలకే అమ్మాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆ ఇంటిని ఆరుద్ర ఇతరులకు అమ్మకుండా అడ్డుపడ్డారని చంద్రబాబు ఆగ్రహించారు.

అక్రమ కేసులతో వేధించి, చంపిన చరిత్ర ఈ వైసీపీది.. అనంతరం ఆ కానిస్టేబుళ్ల వేధింపులపై ప్రభుత్వ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంతో పాటు అనేకచోట్ల ఆమె ఫిర్యాదు చేసినా, ఫలితం లభించలేదని.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరుద్ర సీఎంకు ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి వస్తే.. తనను, తన బిడ్డను అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో 2022 నవంబర్‌లో సీఎం క్యాంప్ కార్యాలయం వద్దనే ఆరుద్ర ఆత్మహత్యకు యత్నించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత తనకు న్యాయం చేయాలని కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆరుద్ర నిరసన దీక్షకు దిగితే, పోలీసులు అడ్డుకుని ఆరుద్ర, ఆమె కుమార్తెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారన్నారు. ఆరుద్ర మానసిక స్థితి సక్రమంగా లేదని చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ప్రభుత్వ అధికారులు సహకరించకపోగా.. మరింత ఎక్కువ వేధింపులకు గురి చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని మానసిక రోగులుగా ముద్రవేసి, అక్రమ కేసులతో వేధించి.. చంపిన చరిత్ర ఉన్న ప్రభుత్వం ఈ వైఎస్సార్సీపీ అని ఆయన మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ఇలాగే చేశారని దుయ్యబట్టారు. ఆరుద్రను వేధించిన వారిపై విచారణ జరిపి, వారికి శిక్షపడేలా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆమె బిడ్డకు తగిన వైద్యం కూడా అందించి, ఆదుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

అసలు ఏం జరిగిందంటే.. కాకినాడ రూరల్‌ పరిధిలోని రాయుడుపాలెంకు చెెందిన రాజులపూడి ఆరుద్ర.. కదల్లేని స్థితిలో ఉన్న తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర శస్త్ర చికిత్స కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని సాయం కోరుతూ.. మంత్రుల, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో కుమార్తె సాయిలక్ష్మీచంద్ర చికిత్స కోసం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఉన్న సొంత ఇల్లు అమ్మి, వైద్యం చేయిద్దామని ఇల్లు విక్రయానికి పెట్టారు. దీంతో రూ.40 లక్షలకు బేరం కుదరగా.. మంత్రి దన్నుతో ఇద్దరు కానిస్టేబుళ్లు రూ.10 లక్షలకే ఇంటిని విక్రయిచాలంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ ఆరుద్ర కన్నీరుమున్నీరయ్యారు.

ఈ క్రమంలో ఇటీవలే ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కుడిపూడి సూర్యనారాయణలతో తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి వేధిస్తున్నారంటూ చంద్రబాబు ఎదుట ఆరుద్ర తన గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన చంద్రబాబు..ఆరుద్ర కుటుంబానికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆరుద్రకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.