ETV Bharat / state

"కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు.. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కుట్ర.."

author img

By

Published : Jun 3, 2023, 7:47 PM IST

Chalasani Srinivas
చలసాని శ్రీనివాస్

Polavaram Issue : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి సమస్యలపై ఎందుకు పోరాడటం లేదని.. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైందని విమర్శించింది. అన్ని రాజకీయ పార్టీలు పోలవరంపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చింది.

Polavaram Project Hight Issue : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు 135 అడుగులకు కుదించాలనే కుట్ర జరుగుతుందని.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, రైతాంగ సమాఖ్య నాయకులు యేర్నేని నాగేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అఖిల పక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఎంపీల జీతాలు పెరగాలి.. ప్రజా ప్రతినిధులు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దిల్లీలో ఇళ్లు కట్టుకోవాలి.. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మాత్రం పెంచరా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే మన ఎంపీలు నోరు విప్పరని, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా రాష్ట్రంలో ఎంపీలు షాపుల ప్రారంభోత్సవాలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని నమ్మితే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు పరిస్థితి ఏమైందో.. రానున్న ఎన్నికల్లో జగన్​కు కూడా ఆదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. రాజకీయాలు రాష్ట్రంలో చేసుకోండి కానీ, కేంద్రం వద్ద మాత్రం అన్ని పార్టీలు ఒక్కటిగా ఉండాలని కోరారు.

రాష్ట్రం విషమ పరిస్థితిలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు దీని గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగే మోసాలపై.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే ఆంశాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎనబై సంవత్సరాల క్రితం అనేక మంది పెద్దలు కలిసి పోలవరం నిర్మాణానికి ప్రణాళిక అందిస్తే.. చివరకు దాని నిర్మాణానికి ఆమోదం వచ్చిందని వివరించారు. నిర్మాణానికి స్వతంత్ర కాలం నాటి పరిస్థితులు అడ్డు తగిలాయని వివరించారు. మళ్లీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​ రెడ్డి నిర్మాణాన్ని మొదలు పెట్టారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావాల్సింది పోయి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై భారీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తామని అన్నారని పేర్కొన్నారు. పోలవరాన్ని కేవలం బ్యారేజీలాగా మార్చటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైందని దుయ్యబట్టారు.

పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తే రాష్ట్ర భవిష్యత్​కే నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి సమస్యలపై ఎందుకు కలిసి పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై అన్ని పార్టీలు కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నాయని.. పోలవరం అంశంపై ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి అన్ని పార్టీలను కలిపి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అలస్యమైందన్నారు.

చలసాని శ్రీనివాస్​, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్​

"పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థం ఎత్తును 135 అడుగుల వరకు పరిమితం చేయటానికి కుట్ర చేస్తున్నారని సంవత్సరం ముందు నుంచి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కుమ్మక్కైందని ఆరోపణ చేస్తున్నాము. ఇది నిజం కాదంటే అంబటి రాంబబు ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. అవినీతి ఆరోపణలు చేయటం లేదు.. రాష్ట్ర భవిష్యత్​ కోసం మాట్లాడుతున్నాను." -చలసాని శ్రీనివాస్​, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్​

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.