Chandrababu Naidu Women Prajavedika : 'విద్య, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతే.. 'మహాశక్తి'తో మరింత భరోసా'

Chandrababu Naidu Women Prajavedika : 'విద్య, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతే.. 'మహాశక్తి'తో మరింత భరోసా'
Chandrababu Naidu Prajavedika : మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలందరినీ ఆదుకుంటామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఆడబిడ్డలకు 33 శాతం చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టామని గుర్తు చేశారు.
Chandrababu Naidu Prajavedika: వైసీపీలో కీచకులు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. కరెంటు బిల్లులు 8 సార్లు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేయకపోగా లిక్కర్ ధరలు భారీగా పెంచారని, నాసిరకం మద్యం, సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ఆరోగ్యం పాడు చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సాగు పెరిగిందన్న చంద్రబాబు.. తద్వారా గృహ హింస పెరిగిందని అన్నారు.
నిర్భయ నిధులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని, దిశ యాప్ ఉపయోగపడటం లేదని తెలిపారు. మహిళల రక్షణ విషయంలో మన రాష్ట్రం 22 వ స్థానంలో ఉందని... నాలుగున్నర ఏళ్లలో అరాచక పాలన సాగుతోందని పేర్కొన్నారు. సహజ వనరుల దోపిడీ చేస్తున్నారని, టమోటా ధర మొన్న వంద ఉంటే నేడు ఒక రూపాయికి పడిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. 25 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని దుయ్యబట్టారు.
ప్రతి కుటుంబానికి 4 గ్యాస్ సిలిండర్లు.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తెచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. ఆడబిడ్డ నిధి ద్వారా సంవత్సరానికి 18 వేలు వేస్తామని వివరించారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు, అవసరమైతే నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఇస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. పేదిరిక నిర్మూలనలో భాగంగా పేదవారిని ధనికులను చేస్తామని... ఇది సాధ్యం అవుతుందన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే కరెంటు ఛార్జీలు ( Electricity charges ) పెంచేవాడిని కాదన్న చంద్రబాబు.. జగన్ భారీగా కరెంటు ఛార్జీలు పెంచారన్నారు. అన్నా క్యాంటీన్ ( Anna canteen) ద్వారా రోజుకు మూడు పూటలా 15 రూపాయల ఖర్చుకే భోజనం పెట్టామన్నారు. ట్రాన్స్‌జెండర్లకు పింఛన్ ఇచ్చామని... వారిని సైతం ఆదుకుంటామని బాబు వివరించారు.
ప్రజలే నా ఆస్తి.. ప్రజలే నా ఆస్తి... డబ్బులు, భూమి కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు ( TDP leader Chandrababu ) అన్నారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాలని ఆయన పేర్కొన్నారు. 'బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో 'మహిళతో ప్రజావేదిక'లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమర్థత పెంపు, ప్రైవేటు పెట్టుబడుల కోసమే ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. కానీ ధనికులు మరింత ధనికులవుతున్నారు తప్ప.. పేదవాళ్లు బాగుపడట్లేదని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టామని చెప్పిన చంద్రబాబు.. పేదవాళ్లందరినీ భాగస్వాములను చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నారు. పేదవాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావాలని, వాళ్లను ధనికులను చేయాలని అన్నారు. ప్రజలే నా ఆస్తి... డబ్బులు, భూమి కాదన తెలిపారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాలని, అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెరగవన్న చంద్రబాబు.. సౌర, పవన విద్యుత్ తీసుకొస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
