TDP Chief Chandrababu Interacts with Rayadurgam Leaders: రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేసినా చేస్తారు: చంద్రబాబు
Published: Sep 6, 2023, 4:15 PM

TDP Chief Chandrababu Interacts with Rayadurgam Leaders: అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తే.. అడ్డుకునే పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆరోపించారు. గడిచిన నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి అయినా చేశారా? అంటూ ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా కాలవ శ్రీనివాసులు ఉన్నారని... రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు పేరు ఎత్తలేదని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో పోటీచేసేది నేను అని చెప్పుకోవాలా? అని చంద్రబాబు పేర్కొన్నారు.
26 ఎంక్వయిరీలు వేసినా వైఎస్ తనను చేయలేకపోయారన్న చంద్రబాబు... తాను నిప్పులా బతికానని.. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు చూపెట్టలేకపోయారని గుర్తు చేశారు. ప్రజల తరఫున పోరాడుతున్న తన మీద దాడి కూడా చేస్తారన్న చంద్రబాబు.. రేపో, ఎల్లుండో అరెస్టు చేసినా చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు చేసే తప్పులన్నీ తమపై నెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారన్న చంద్రబాబు... జగన్ కరడుగట్టిన సైకో అంటూ విమర్శించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా కొనసాగించామన్న చంద్రబాబు.. సంపదను సకాలంలో సంక్షేమ కార్యక్రమం ద్వారా పేదలకు అందించినట్లు పేర్కొన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేసింది తెలుగుదేశం పార్టీయే అని గుర్తు చేశారు.