ETV Bharat / state

NADU-NEDU: నత్తనడకన నాడు-నేడు.. అసంపూర్తి పనులతో అవస్థలు

author img

By

Published : Jun 5, 2023, 9:04 PM IST

NADU-NEDU SCHOOLS WORKS: విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం సమీపిస్తున్నా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు రెండోదశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం గోడలకే పరిమితమైంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి తరగతి గదులు సిద్ధం చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ అరకొరగానే పూర్తయ్యాయి. బడి ఆవరణలోనే నిర్మాణ సామగ్రి ఉండటంతో విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

nadu nedu schools works story
నత్తనడకన సాగుతున్న నాడు-నేడు పథకం రెండోదశ పనులు

నత్తనడకన సాగుతున్న నాడు-నేడు పనులు

NADU-NEDU SCHOOLS WORKS: నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం సహా వివిధ పనులను ప్రభుత్వం చేపట్టింది. విద్యార్థులకు సరిపడినన్ని గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పనులు రోజుల తరబడి సాగుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పాఠశాలలు జరుగుతున్నప్పుడే పనులు చేయడంతో ఇబ్బంది పడగా.. ఈ వేసవిలో పనులన్నీ పూర్తిచేసి విద్యా సంవంత్సరం ప్రారంభయ్యే నాటికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.

అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో పాటు నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. తొలిదశ పనుల్లో నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో నెలల వ్యవధిలోనే మరుగుదొడ్లు, మూత్రశాలల్లో సింకులు, నల్లాలు విరిగిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండోదశ పనుల్లో 578 తరగతి గదుల నిర్మాణం చేపట్టగా.. కనీస స్థాయిలోనూ పనులు జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే వీటి నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా.. ఇప్పటికి సగం పనులు కూడా కాలేదు. విజయవాడలో స్థలం లేకపోవడంతో పాత భవనాలపైనే మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పాత భవనాల సామర్థ్యం పరీక్షించకుండానే కొత్త నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

"గవర్నమెంట్ స్కూల్స్​ను అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమం చేపట్టినట్లు చెప్తోంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించి రెండున్నరేళ్లు అవుతున్నా.. పాఠశాలల్లో పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇలా అయితే వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్న ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తారని మేము ప్రశ్నిస్తున్నాము." - సోమేశ్వరరావు, ఎస్​ఎఫ్​ఐ జిల్లా అధ్యక్షుడు

కొవిడ్ నెపంతో నాడు-నేడు తొలిదశ పనుల్లో తీవ్రం జాప్యం జరగగా.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవులు పూర్తవుతున్నా.. ఏ ఒక్క పాఠశాలలోనూ పనులు పూర్తికాలేదు. ముఖ్యంగా విజయవాడ నగరంలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అనేక చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు మూసివేయడం.. ప్రాథమిక విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలపడంతో తరగతి గదుల కొరత మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఉన్న నిధులన్నీ ఖర్చవడంతో.. కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే తరగతి గదులు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.

"జూన్​ నెల 12వ తేదీన పాఠశాలలు ప్రారంభించేసరికి.. పిల్లల పాఠ్యపుస్తకాలు, మంచినీటి నుంచి మరుగుదొడ్లు వరకు అన్ని వసతులను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఇప్పటికీ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదు. స్కూల్స్ రీ ఓపెనింగ్ అయిన తర్వాత పనులు నిర్వహిస్తే.. విద్యార్థులకు క్లాసులు ఎలా నిర్వహిస్తారు..?" - రవిచంద్ర, పీడీఎస్‌యు. రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.