ETV Bharat / state

గన్నవరం నుంచి షిర్డీకి మార్చి 26న కొత్త విమాన సర్వీసు..

author img

By

Published : Mar 10, 2023, 10:39 PM IST

Flight service
విమాన సర్వీసు

Shirdi Flight service start from March 26: గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయినా.. ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, విఫలమవుతుంది. గతంలో రోజుకు కనీసం 50కు పైగా సర్వీసులు ఇక్కడికి వచ్చి, వెళ్లేవి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ప్రస్తుతం రోజుకు 17 దేశీయ సర్వీసులు మాత్రమే గన్నవరానికి వచ్చి వెళుతున్నాయి. షిర్డీకి మార్చి 26న విమాన సర్వీసులు ప్రాంభం కానున్న నేపథ్యంలో మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Shirdi Flight service start from March 26: గన్నవరం విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26న ఆరంభం కానున్న విమాన సర్వీసులో ఇప్పటికే సగం సీట్లు నిండిపోయాయి. విజయవాడ నుంచి షిర్డీకి రైలులో వెళితే ఒక రోజు పడుతోంది. కొత్తగా ప్రారంభం కానున్న విమాన సర్వీసులో కేవలం రెండున్నర గంటల్లో షిర్డీలో దిగిపోవచ్చు. టిక్కెట్‌ ధర కూడా రూ.4,639 నిర్ణయించడంతో ఎక్కువ మంది విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని ఏ నగరానికి విమాన సర్వీసులు నడిపినా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయినా.. ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు విఫలమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి రోజుకు కనీసం 50కు పైగా సర్వీసులు ఇక్కడికి వచ్చి, వెళ్లేవి. ఉదయం 8 నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రతి 15నిమిషాలకో దేశీయ సర్వీసు ఖచ్చితంగా ఉండేది. ప్రస్తుతం రోజుకు 17 దేశీయ సర్వీసులు మాత్రమే గన్నవరానికి వచ్చి వెళుతున్నాయి. వీటిలో హైదరాబాద్, బెంగళూరుకే 11 ఉన్నాయి. మిగతా వాటిలో దిల్లీ, చెన్నైకు రెండు చొప్పున, తిరుపతికి ఒకటి ఉన్నాయి. విశాఖ నుంచి ఒక సర్వీసు ఇక్కడికి వచ్చి.. హైదరాబాద్‌కు వెళుతోంది. విజయవాడలో బయలుదేరి విశాఖకు నడిచే సర్వీసు ఒక్కటి కూడా లేదు.


గతంలో దిల్లీకి నాలుగు సర్వీసులు ఇక్కడి నుంచి నిత్యం వెళ్లేవి. ప్రస్తుతం వాటిని రెండుకు తగ్గించేశారు. ఉదయం, రాత్రి ఒక్కో సర్వీసు ఇక్కడి నుంచి దిల్లీకి ప్రస్తుతం నడుస్తున్నాయి. నిత్యం 80శాతం ఆక్యుపెన్షీతో దిల్లీ సర్వీసులు నడిచేవి. ఎయిరిండియా మొదట దిల్లీకి నిత్యం ఒక సర్వీసును ప్రారంభించింది. తర్వాత.. డిమాండ్‌ను బట్టి మరో రెండు సర్వీసులను ఆరంభించింది. వీటిలో రెండు నేరుగా గన్నవరం నుంచి దిల్లీకి, ఒక సర్వీసు హైదరాబాద్‌ మీదుగా నడిచేది. గతంలో తరచూ విమానయాన సంస్థలతో గన్నవరంలో సమావేశాలు ఏర్పాటు చేసి.. కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం, గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కమిటీ, అధికారులు తరచూ ఆయా సంస్థల ముఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదనే చెప్పాలి.

కొచ్చి, వారణాశి, ముంబయికి నడిచే సర్వీసులను ఎందుకు ఆపేశారో కూడా చెప్పకుండా సాంకేతిక కారణాలను సాకుగా చూపించి అకస్మాత్తుగా నిలిపేశారు. తాజాగా షిర్డీకి ఈనెల 26నుంచి ఆరంభం అవుతున్న సర్వీసుకు టిక్కెట్లు బుక్కవుతున్నట్టే.. ఈ మూడు ప్రాంతాలకూ ఎక్కువ రద్దీ ఉండేది. కృష్ణా, గుంటూరు, ఏలూరు మూడు జిల్లాల నుంచి ప్రయాణికులు ఏటా పెద్దఎత్తున కేరళకు పర్యాటకంగా వెళ్లి వస్తుంటారు. వేసవి వస్తే.. కేరళలో సేదదీరి వచ్చేందుకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. శబరిమలకు కూడా ఏటా వేల సంఖ్యలో భక్తులు విజయవాడ నుంచే వెళుతుంటారు. టిక్కెట్‌ ధర కూడా రూ.4 నుంచి రూ.6వేల మధ్యలో ఉండేది. వారణాశి సర్వీసు కూడా 70శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడిచేది. ముంబయి సర్వీసుకు కూడా భారీ డిమాండ్‌ ఉండేది. ఈ నగరాలన్నింటికీ మళ్లీ సర్వీసులను పునరుద్ధరించాలంటూ ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.