ETV Bharat / state

అక్కడ రోజూ భూకంపమే.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవనం

author img

By

Published : Jan 24, 2023, 10:44 AM IST

Explosions in Ramagundam OCP-5
Explosions in Ramagundam OCP-5

Explosions in Ramagundam OCP-5 : మధ్యాహ్నం అయ్యిందంటే చాలు సమీపంలో జరిపే పేలుళ్లతో అక్కడి ప్రాంతాలు దద్దరిల్లుతాయి. భారీ శబ్దాలతో గ్రామస్థుల గుండెలు దడదడలాడతాయి. ఏళ్లుగా స్థానికులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండటం వారికి తప్పడం లేదు. పేలుళ్లకు దాటికి ఇళ్లకు బీటలు వారినా... పగుళ్లు వచ్చి కూలిపోతున్నా.. పట్టించుకున్న నాథుడే లేడు. దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న తెలంగాణలోని రామగుండం ఒకటో రిజీయన్ వాసుల పరిస్థితి దయనీయంగా మారింది.

Explosions in Ramagundam OCP-5 : తెలంగాణలోని రామగుండం ఒకటో రీజియన్ పరిధిలోని భూ ఉపరితల గని పేలుళ్లు.. పరిసర గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి. బొగ్గు కోసం పేలుళ్లు నిత్యకృత్యమవడంతో చుట్టూ పక్కల గ్రామస్థులు... బెంబేలెత్తిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏళ్లుగా స్థానికులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ముఖ్యంగా రోజూ మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించే పేలుళ్ల మూలంగా అక్కడ భూకంపమే చోటు చేసుకుంటుంది. ఇలా ఏళ్లుగా పరిమితికి మించి ఇష్టానుసారంగా భారీ శబ్దాలతో పేలుళ్లు నిర్వహిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.

అక్కడ రోజూ భూకంపమే.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవనం

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం : ఓసీపీ-5 పేలుళ్లు రామగుండంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరిమితికి మించి సాగుతున్న పేలుళ్లతో.. చుట్టుపక్కల గ్రామస్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. పేలుళ్ల శబ్దాలు వింటే చాలు.. గ్రామస్థులు ఉలిక్కిపడుతున్నారు. భారీ శబ్దాల ధాటికి ఎక్కడ ఇంటి పైకప్పు పెచ్చులూడి మీద పడుతుందోనని కొందరు.. ఇంటి గోడలు కూలిపోతాయేమోనని ఇంకొందరు.. ఇలా స్థానికులంతా భయం గుప్పిట బతుకుతున్నారు.

పండగకి చుట్టాలను పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు : దద్దరిల్లుతున్న భారీ పేలుళ్లతో చంటి పిల్లలు ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడుస్తుంటే... వృద్ధుల గుండెల్లో దడ పుడుతోంది. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న నిరుపేదల ఇళ్లన్నీ నెర్రెలు వారుతున్నాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడడం, ఇంటిగోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇంటి గోడల జాయింట్లు ఊడిపోవడం, బీటలు వారుతున్నాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఏదైనా పండగకి చుట్టాలను పిలిస్తే ఆ శబ్దాలు, దుమ్ము, ధూళి కారణంగా ఎవరూ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు.

'బువ్వకు లేకుండా ఉన్న వాళ్లం. ఫించన్ మీదనే బతుకుతున్నాం. ఆ పేలుళ్లు వచ్చినప్పుడు మా గోడలు అదురుతున్నాయి. అధికారులు స్పందించి కలిసి మాకు ఏదైనా వేరే ప్రాంతం చూపించండి. మమ్మల్ని పట్టించుకోండి. మీ తల్లిదండ్రులను చూసుకుంటున్నట్లు మమ్మల్ని కాపాడండి. ఆ శబ్దాలకు తట్టుకోలేక ఇళ్లను విడిచిపెట్టే పరిస్థితి ఉంది.'-స్థానికురాలు

'మొదటి నుంచి ఓసీపీ-5ను వ్యతిరేకిస్తున్నాం. అప్పటి నుంచి ధర్నా చేస్తున్నాం. ఓసీపీ-3 బ్లాస్టింగ్‌తోనే ఇబ్బందులు పడుతున్నామంటే.. ఇప్పుడు ఓసీపీ-5తో ఇక్కడ ఉండలేని పరిస్థితి నెలకొంది. దానిని వ్యతిరేకిస్తే అప్పుడు అధికారులు దానికంటే తక్కువ రేంజ్‌తో చేపడుతాం అన్నారు. ఆధునాతన టెక్నాలజీతో పనులు చేపడుతామని చెప్పారు. దీని వలన ప్రాణాలొదిలే పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల 10 డివిజన్లు బాధపడుతున్నాయి. రామగుండం అంటే ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండేది. నేడు ఓసీపీ-5 వల్ల ఉన్న ఎవరూ ఉండలేకుండా తయారవుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. ఒకప్పుడు కరోనాతో మాస్కులు పెడితే.. ఇప్పుడు దీని వల్ల అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. వృద్ధులు, గర్భిణీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.'- పి. తేజస్విని, 11వ డివిజన్ కార్పొరేటర్ రామగుండం

శాశ్వత పునరావాసం కల్పించాలి : రామగుండం ఓసీపీ-5 బొగ్గు తవ్వకాల మూలంగా సమీప గ్రామ ప్రజలు శబ్ద కాలుష్యంతోపాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు వీటి శబ్దాలు తాళలేక బడి మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సింగరేణి యాజమాన్యం వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. శాశ్వత పునరావాసం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.