ETV Bharat / state

కుల గణన పారదర్శకంగా నిర్వహించాలి - వాలంటీర్ల భాగస్వామ్యంపై కులసంఘాల అభ్యంతరం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 10:35 AM IST

Caste_Census_in_Andhra_Pradesh
Caste_Census_in_Andhra_Pradesh

Caste Census in Andhra Pradesh: రాష్ట్రంలో కుల గణన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం తొలుత వివిధ ప్రజా, కులసంఘాల నుంచి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించింది. సుమారుగా 9 దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న కుల సర్వేలో.. వాలంటీర్లను భాగస్వామ్యులను చేయడంపై ప్రజా, కులసంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పకడ్బందీగా, పారదర్శకంగా కులగణనను నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Caste Census in Andhra Pradesh: కుల గణన పారదర్శకంగా నిర్వహించాలి - వాలంటీర్ల భాగస్వామ్యంపై కులసంఘాల అభ్యంతరం
Caste Census in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో కుల గణనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 723 కులాలుండగా.. ఇందులో 145 బీసీ కులాలు, 59 ఎస్సీ, 92 ఎస్టీ కులాలున్నాయి. మిగతావి ఇతర కులాలుగా గుర్తించారు. ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే విషయమై ప్రభుత్వం వద్ద కచ్చితమైన వివరాలు లేవు.

జనాభా ఎక్కువున్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని, తమకు సంక్షేమ ఫలాలు అందడం లేదనే వాదనలు ఎప్పటి నుంచో వివిధ సామాజిక తరగతుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుల గణనపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో మూడుచోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించి కుల, ప్రజా సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తోంది. విజయవాడలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అధికారులు హాజరయ్యారు.

'పేదరిక నిర్మూలన కోసమే కులగణన - కులాల వారీగా మేలు చేయడమే లక్ష్యం'

ఇకపోతే దేశంలో తొలిసారిగా 1931లో సమగ్ర కుల గణన జరిగింది. అంతకుముందు కొన్నిసార్లు చేపట్టినా అవి సమగ్రంగా లేవు. 1941లో రెండోసారి కుల గణన జరిపాలని భావించినా.. రెండో ప్రపంచ యుద్ధం మూలంగా సాధ్యపడలేదు. 1951లో జనాభా లెక్కలు మాత్రమే సేకరించారు. అంటే ఈ లెక్కన సమగ్ర కుల సర్వే జరిగి 92 సంవత్సరాలు పైగా కావస్తుంది. మధ్యలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత అప్పటి లెక్కలన్నీ మారిపోయాయి.

ఈ నేపథ్యంలో కుల గణనపై ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అర్హులైన పేదలు, నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నా.. జనాభా దామాషా ప్రకారం నిధులు అందజేయాలన్నా.. సామాజిక, ఆర్థిక, విద్య పరిస్థితులు తెలుసుకునేందుకు కుల గణన అవసరం. రిజర్వేషన్లు అమలు చేయాలన్నా.. ఆర్థిక ప్రయోజనాలు పొందాలన్నా.. కులగణన కీలకమే.

Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్​-రే' లాంటిది: రాహుల్​ గాంధీ

అయితే ముందుగా తాము సర్వే ఏ విధంగా చేపట్టబోతున్నామో చెబుతూ.. కుల గణనలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యులను చేసింది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. సర్వేలో వాలంటీర్లను భాగస్వాములను చేస్తామనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సరికాదంటూ వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికులు, సంచార జాతులకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించాలని, కుల గణన జరిగాక వెంటనే ప్రకటించకుండా గ్రామస్థాయిలో అభ్యంతరాలు స్వీకరించాలని చెబుతున్నారు.

కుల గణన జరిగిన వేళ ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించాలని సూచిస్తున్నారు. సర్వే చేసేటప్పుడు కుటుంబ పెద్ద ఈ-కేవైసీ ఉండాలని చెబుతున్నారని, ఈ-కేవైసీతో సంబంధం లేకుండా కుల సర్వే చేపట్టాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు వక్రమార్గంలో బీసీ సర్టిఫికేట్లు పొంది రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారని.. అలాంటి వాటికి కుల గణనతో అడ్డుకట్ట వేయాలని కులసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Rahul Gandhi On Caste Census : దేశవ్యాప్త కులగణనకు కాంగ్రెస్ డిమాండ్​.. ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం!

కుల గణనను మొక్కుబడి తుంతుగా కాకుండా ఉద్యోగులతో పక్కాగా జరపాలని కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని సూచిస్తున్నారు. కుల గణన రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం కాదని, సామాజిక కోణం ముఖ్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సర్వే నిర్వహణలో ఎలాంటి తప్పులకు, అపోహలకు తావివ్వకూడదని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

కులవృత్తులు అంతరించాయి, కులాలు మాత్రమే ఉన్నాయి: మంత్రి వేణుగోపాల్​కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.