'పేదరిక నిర్మూలన కోసమే కులగణన - కులాల వారీగా మేలు చేయడమే లక్ష్యం'
Minister Venu Gopal on AP Caste Census : రాష్ట్రంలో కులగణనను తొందరపాటుకు వీలులేకుండా సమగ్రంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. కులగణన ద్వారా అన్ని కులాలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన కులగణన రౌండ్ టేబుల్ సదస్సులో మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డిల్లీరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
2023 Caste Census in AP: కులగణన ద్వారా అన్ని కులాల వారికి పేదరికం ఆధారంగా మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. కులగణన జరిపే ముందు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. వివిధ కులసంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కులగణన ప్రక్రియలో వాలంటీర్లు ఉంటున్నప్పటికీ సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సామాజిక వర్గాల సమతుల్యత కాపాడాలనే అంశంపై కులగణన నిర్వహిస్తున్నామన్నారు. కులగణన చేపట్టడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులకే అందజేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. కులగణన వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని సామాజిక కోణం ఉందని మంత్రి వేణుగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.