ETV Bharat / state

TDP leaders Polavaram Tour: పోలవరం వెళ్తున్న టీడీపీ నేతల అడ్డగింత.. ఉద్రిక్తత

author img

By

Published : Jun 10, 2023, 8:55 PM IST

Updated : Jun 11, 2023, 6:25 AM IST

Polavaram tour
Polavaram tour

TDP Polavaram tour:పోలవరం పర్యటనకు వెళ్తున్న తెలుగుదేశం నేతలను.... పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి బయల్దేరిన టీడీపీనేతలను మార్గమద్యలోనే పోలీసులు ఆపేశారు. మాజీమంత్రి దేవినేని ఉమా పోలీసులను దాటుకుని బైక్‌పై పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బుట్టాయగూడెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

TDP Leaders Polavaram Visit: పోలవరం ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనింగ్ రహస్యాలు బయటపడతాయనే తెలుగుదేశం పార్టీ నేతలను ప్రాజెక్టు సందర్శనలకు అనుమతి ఇవ్వడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టులోని లోపాలను బాహ్య ప్రపంచానికి తెలుస్తాయనే ఉద్దశంతో టీడీపీ నాయకుల పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చంద్రబాబు తప్పిదం వల్లే దెబ్బతిందంటూ పదే పదే వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో....వాస్తవాలను ప్రజలకు వెల్లడించే ఉద్దేశంతో టీడీపీ నేతలు తలపెట్టిన ప్రాజెక్టు సందర్శనను పోలీసులు అడ్డుకుని వారిని పలు స్టేషన్లకు తరలించారు.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలక నిర్మాణంగా చెప్పుకునే డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు ముందుచూపు లేనితనం కారణంగానే దెబ్బతిందంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల వరకు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలు, లోపాలను ఎత్తి చూపడంతో పాటు ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శన ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరు నుంచి బయలుదేరిన తెలుగుదేశంపార్టీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ ఏలూరు ఇంఛార్జి బడేటి రాథాకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసుల నుంచి తప్పించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా ద్విచక్రవాహనంపై పోలవరం ఏటిగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బుట్టాయగూడెం స్టేషన్ తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే నిమ్మలతో పాటు... గన్ని, రాథాకృష్ణ, వెంకటరాజును గోపాలపురం స్టేషన్ కు తరలించారు. తమ పార్టీ నేతలను అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జవహర్ సైతం పోలవరం ప్రాంతానికి వస్తుండగా మార్గం మధ్యలో కన్నాపురం అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్న పోలీసులు ఆయన్ను బుట్టాయగూడెం స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేతల అరెస్టు విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గోపాలపురం స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమ నాయకులను విడిచిపెట్టాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే నిమ్మలతో పాటు గన్ని, రాథాకృష్ణ, వెంకటరాజును బయటకు తీసుకువచ్చిన పోలీసులు మరో చోటికి తరలించే క్రమంలో గోపాలపురం స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులను ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పాలంటూ ఆ పార్టీ శ్రేణులు పోలీసు వాహనాలను అడ్డుకోగా... పోలీసులు వారిని బలవంతంగా పక్కకు ఈడ్చిపడేసి వాహనాలను ముందుకు పోనిచ్చారు.

వాహనంలోకి ఎక్కించుకున్న టీడీపీ నేతలను కొద్దిసేపు జాతీయ రహదారిపై అటూ ఇటూ తిప్పి, నిమ్మలను పెనుమంట్ర పోలీసులకు అప్పజెప్పగా... మిగిలిన వారిని తిరిగి గోపాలపురం స్టేషన్ కు తీసుకువచ్చారు. మధ్నాహ్నం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ వారి వారి ఇళ్ల వద్ద పోలీసులు విడిచిపెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యమే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. కేవలం ధనదాహం కారణంగానే ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. ఇక్కడున్న విలువైన ఖనిజ సంపదపై ముఖ్యమంత్రి కన్నుపడిన కారణంగానే ప్రజాప్రతిధులను సైతం ప్రాజెక్టు సందర్శనకు అనుమతించని పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.

పోలవరం ప్రాజెక్టును ఎప్పటికైనా పూర్తి చేసేది చంద్రబాబు నాయుడేనని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం డయాఫ్రమ్ వాల్ వద్ద ఇసుక పూడ్చే నెపంతో వేల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల నాటికి వాటిని బిల్లుల రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కి తరలించి కనిపించకుండా పోతాడని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.

Last Updated :Jun 11, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.