ETV Bharat / state

'జగన్ సేవకులకు కాదు... జన సేవకులకు ఓటేయండి'

author img

By

Published : Mar 31, 2021, 4:10 PM IST

తిరుపతి ఉపఎన్నికల్లో భాజపా - జనసేన కూటమి జోరుగా ప్రచారం సాగిస్తోంది. భాజపా విజయానికి కార్యకర్తలందరూ శ్రమించాలని జీవీఎల్ పిలుపునిచ్చారు.

BJP-Janasena meeting in Srikalahasti
జీవీఎల్ నరసింహారావు

శ్రీకాళహస్తిలో భాజపా-జనసేన సమావేశం

జగన్ సేవకులకు కాదు... జన సేవకులకు ఓటేయాలని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా, జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భాజపా అభ్యర్థి రత్నప్రభ విజయానికి శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్​గా పంపాలన్న వైకాపా నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. ఉప ఎన్నిక జగన్ పుట్టినరోజు వేడుకలు కాదని ప్రజల భవిష్యత్తును నిర్ణయించే కార్యక్రమం అనే విషయాన్ని వైకాపా గుర్తుంచుకోవాలన్నారు.

కరోనా సమయంలో భాజపా, జనసేన కార్యకర్తలు ప్రజా సేవలో ఉండగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ర్యాలీలు చేపట్టి కరోనా వ్యాప్తికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆటలాడే నేతల అహంకారం తగ్గేలా ప్రజా సేవకులకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు. 2024లో భాజపా - జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఒక ఓటరు మూడు ఓట్లు వేసేలా చూడాలని స్టాలిన్ సినిమా డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహం నింపారు. అనంతరం ఎంపీ అభ్యర్థిని రత్నప్రభ మాట్లాడుతూ... నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుని అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'తలనీలాల వ్యవహారంపై తితిదే శ్వేతపత్రం విడుదల చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.