ETV Bharat / state

పుష్కలంగా తుంగభద్ర జలాలు... ఎప్పుడు విడుదల చేస్తారంటే..!

author img

By

Published : Aug 26, 2021, 5:29 PM IST

పుష్కలంగా నీరు
పుష్కలంగా నీరు

ఈసారి అనంతపురం జిల్లాకు తుంగభద్ర జలాలు పుష్కలంగా అందనున్నాయి. టీబీ డ్యాంకు ముందుగానే వరద పోటెత్తటంతో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఈ ఏడాది వరద పోటెత్తడంతో హెచ్చెల్సీకి నెలరోజుల ముందుగానే నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఇప్పటి వరకు ఐదు టీఎంసీల వరద నీటిని పీఏబీఆర్, ఎంపీఆర్ జలాశయాలకు మళ్లించారు. జిల్లా సాగునీటి సలహా సంఘం సమావేశం అనంతరం ఆయకట్టుకు నిటి విడుదలకు తేదీ ఖరారు కానుంది. అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి నారుమళ్లకు నీరు ఇవ్వటానికి అధికారులు ప్రణాళిక చేశారు.

తుంగభద్రలో పుష్కలంగా నీరు

ఈ ఏడాది ఖరీఫ్​లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఏటా ఆగస్టులో నీరు విడుదల చేయటం, వరి పంట కీలక దశలో ఉన్నపుడు నీటిని నిలిపివేసేవారు. తాగునీటి అవసరాల నిమిత్తం ఆయకట్టుకు పరిమితంగా నీరిచ్చే పద్దతిని అధికారులు ఆచరిస్తూ వచ్చారు. అయితే ఈసారి టీబీ డ్యాంకు ఎగువన మంచి వర్షాలు కురవటంతో కేవలం రెండు రోజుల్లోనే జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని జూలై లో హెచ్చెల్సీ కాలువకు విడుదల చేశారు.

ఈ నీటిని జిల్లాలో ప్రధాన తాగునీటి జలాశయాలు పీఏబీఆర్, ఎంపీఆర్​లకు మళ్లించారు. నెల రోజులుగా హెచ్చెల్సీ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తనం ఈ రెండు జలాశయాల్లో ఐదు టీఎంసీల నీరు నిల్వచేశారు. జిల్లాకు గత ఏడాది హెచ్చెల్సీ ద్వారా 27 టీఎంసీల రాగా, ఈసారి టీబీడ్యాం ముందుగానే నిండినందున 29 టీఎంసీలు వస్తుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తుంగభద్ర జలాశయానికి సీజన్ లో 198 టీఎంసీల వరద వస్తుందని అంచనా వేసిన టీబీ బోర్డు అధికారులు కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ లోని కాలువల ద్వారా 168 టీఎంసీలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. నీటి వినియోగంపై జిల్లాల వారీగా సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.

అయితే అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా ఈ సమావేశం జరగలేదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ ఐఏబీ సమావేశంలో జిల్లాకు వచ్చే తుంగభద్ర జలాలను వివిధ తాగు, సాగు నీటి అవసరాలకు తగినట్లు పంపకానికి ప్రణాళిక చేస్తారు. ఈసారి సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ముందస్తుగా వర్షాలు కురిసినందున చాలా మంది రైతులు బోర్ల కింద నారుమళ్లు పోసుకొని, నాట్లు వేయటానికి సిద్ధం చేసుకున్నారు. కాలువకు నీటి విడదల చేయగానే నాట్లు వేసుకునేలా రైతులు ప్రణాళిక చేసుకొని ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.