ETV Bharat / sports

'ఒత్తిడి కోసమే ఎదురు చూస్తుంటా.. అదే నా బలం'

author img

By

Published : Jan 11, 2023, 6:36 AM IST

ravichandran ashwin
r ashwin

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆఫ్​ స్పిన్నర్​గా తనదైన ముద్ర వేసి టెస్టుల్లో కపిల్​ దేవ్​ రికార్డునే బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో సోషల్​ మీడియాలో కొనసాగుతున్న ఓ చర్చపై ఆయన స్పందించాడు.

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాను ఎప్పుడూ ఒత్తిడి కోసం ఎదరు చూస్తానని చెప్పాడు. ప్రతిదాన్ని పెద్ద మ్యాచ్‌గా చూస్తానని ఒత్తిడిని ఎంజాయ్‌ చేస్తానని అశ్విన్‌ తెలిపాడు. ఆఫ్ స్పిన్నర్‌గా తనదైన ముద్ర వేసిన అశ్విన్‌ టెస్టుల్లో 449 వికెట్లు పడగొట్టి కపిల్‌ రికార్డు(434 వికెట్లు)ను ఇదివరకే బద్ధలు కొట్టాడు. అత్యంత ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆల్‌రౌండర్ల జాబితాలో కపిల్‌ 5248 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ స్థానానికి చేరుకోవడానికి మాత్రం చాలా దూరంగానే ఉన్నాడు. గణాంకాల పరంగా కాకుండా.. ప్రస్తుతం కపిల్‌ తర్వాత రెండో ఉత్తమ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న చర్చపై అశ్విన్‌ స్పందించాడు. "అతి వినయం ప్రదర్శించడం, సందేహాస్పదంగా వ్యవహరించడం నాకు నచ్చదు. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఉత్తమంగా సాధించాలి. కపిల్‌ దేవ్‌ కేవలం గొప్ప భారత క్రికెటర్‌ మాత్రమే కాదు, ప్రపంచం గుర్తించిన అద్భుతమైన క్రికెటర్లలో ఒకరు. బ్యాట్, బంతి పట్టుకునే ఏ పిల్లవాడికైనా నేను చెప్పేది ఒకటే.. ఏది ఎంపిక చేసుకున్నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గతంలో ఎవరు ఏ ఘనత సాధించారనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. ఏది చేసినా ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండాలి. భారత్‌ తరఫున ఆడుతుంటే చాలా అంచనాలు ఉంటాయి. కచ్చితంగా మీకు ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి. కానీ అవి మీ స్థాయిని తగ్గించకుండా చూసుకోవాలి. నేను ఎప్పుడూ ఒత్తిడి కలిగించే, గొప్ప క్షణాల కోసం జీవిస్తాను. ఏ మ్యాచ్‌ అయినా నాకు పెద్దదే. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడికి గురవుతాను ఎందుకంటే దాన్ని నేను ఎంజాయ్‌ చేస్తాను. ఒత్తిడి కోసం ఎదురు చూస్తుంటా" అని అశ్విన్‌ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ ఖాతాలో 5 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.