ETV Bharat / sports

IPL 2023: అదరగొట్టిన కోల్​కతా బౌలర్లు.. RCBపై ఘన విజయం

author img

By

Published : Apr 6, 2023, 11:09 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ ఘన విజయం సాధించింది.

ipl 2023 kolkata night riders royal challengers bangalore match winner
ipl 2023 kolkata night riders royal challengers bangalore match winner

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. కోల్​కతా ఘనవిజయం సాధించింది.

కోల్​కతా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది. ఆరంభంలోనే బెంగళూరుకు షాక్‌ తగిలింది. దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (21)ని కోల్‌కతా మిస్టరీ బౌలర్‌ సునీల్ నరైన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత చక్రవర్తి బౌలింగ్‌లో మరో ఓపెనర్​ డుప్లెసిస్‌ (23) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (5)ను కూడా వరుణ్ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. హర్షల్‌ పటేల్‌ (0)కూడా క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం వచ్చిన సునీల్ నరైన్‌ బౌలింగ్‌లో షహ్‌బాజ్‌ (1) భారీ షాట్‌కు యత్నించి శార్దూల్‌ ఠాకూర్‌ చేతికి చిక్కాడు. బ్రాస్​వెల్​ జట్టు స్కోర్​ బోర్డును పరిగెత్తించే క్రమంలో క్యాచ్​ ఔటయ్యాడు. కోల్‌కతా ఇంపాక్ట్‌ ప్లేయర్ సుయాష్‌ శర్మ బౌలింగ్‌లో బెంగళూరు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనుజ్‌ రావత్ పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్‌కు యత్నించి నరైన్‌ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెటుకున్న దినేశ్​ కార్తీక్​(9) నిరాశపరిచాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్ సుయాష్‌ శర్మ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. కర్ణ్​ శర్మను కూడా ఇంపాక్ట్​ ప్లేయర్​ సుయాశే పెవిలియన్​కు పంపాడు. కోల్​కతా బౌలరల్లో వరుణ్​ చక్రవర్తి, సునీల్​ నరైన్​, సుయాష్​ శర్మ, శార్దుల్​ ఠాకూర్​ అదరగొట్టారు.

టాస్‌ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, రహ్మనుతుల్లా గుర్బాజ్ శుభారంభం చేశారు. అయితే ఆరంభంలోనే కోల్‌కతాకు ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ విల్లే వరుస బంతుల్లో (3.2, 3.3వ ఓవర్‌) రెండు వికెట్లు తీశాడు. తొలుత వెంకటేశ్‌ అయ్యర్ (3).. తర్వాత మన్‌దీప్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 26 పరుగుల వద్దే కోల్‌కతా రెండు వికెట్లను చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ నితీశ్ రాణా (1) మరోసారి నిరాశపరిచాడు. బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ కార్తిక్‌ చేతికి చిక్కాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా.. ఆర్‌సీబీ డీఆర్‌ఎస్‌ తీసుకుని సఫలమైంది.

తర్వాత ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన రహ్మతుల్లా గుర్బాజ్‌ (57) పెవిలియన్‌కు చేరాడు. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఆకాశ్‌ దీప్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. హార్డ్‌ హిట్టర్‌ ఆండ్రూ రస్సెల్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్‌ (46) అర్ధశతకం చేజార్చుకున్నాడు. హర్షల్‌ పటేల్ బౌలింగ్‌లో చివరి బంతికి కీపర్ కార్తిక్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి రింకు పెవిలియన్‌కు చేరాడు. ఆరంభం నుంచి అదరగొట్టిన శార్దూల్‌ ఠాకూర్ (68) భారీ షాట్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సునీల్​ నరైన్​, ఉమేశ్​ యాదవ్​ నాటౌట్​గా నిలిచారు. బెంగళూరు బౌలర్లు డేవిడ్ విల్లే 2, కర్ణ్‌ శర్మ 2.. సిరాజ్, బ్రాస్‌వెల్, హర్షల్‌ పటేల్ తలో వికెట్‌ తీశారు.

గుర్బాజ్​ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్​లో కోల్​కతా ఓపెనర్​ రహ్మనుతుల్లా గుర్బాజ్(57) దుమ్మరేపాడు. వరుస షాట్లతో అలరించి హాఫ్​ సెంచరీ బాదేశాడు. దీంతో లీగ్​ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో హాఫ్​ సెంచరీ సాధించిన తొలి అఫ్గానిస్థాన్​ ప్లేయర్​గా రికార్డుకెక్కాడు.

కెరీర్​లో తొలి హాఫ్​ సెంచరీ..
కోల్​కతా ప్లేయర్​ శార్దూల్‌ ఠాకూర్ (51*) కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటాడు. హర్షల్‌ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఫోర్‌తో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇదే అతడి తొలి హాఫ్‌ సెంచరీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.