ETV Bharat / sports

'రిషభ్ పంత్‌ జెర్సీతో అలా చేస్తారా?'.. బీసీసీఐ అసంతృప్తి

author img

By

Published : Apr 4, 2023, 4:36 PM IST

Updated : Apr 4, 2023, 6:02 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ ఆడిన తొలి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ జెర్సీని డగౌట్‌లో ప్రదర్శించడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటివి చేయకూడదని ఆ జట్టును సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమయ్యిందంటే..

Rishabh Pant jersey
Rishabh Pant

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.. టీమ్​ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌. గత కొన్నేళ్లుగా ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ టీమ్​కు సారథ్య బాధ్యతలు వహించిన పంత్​.. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ సీజన్​కు దూరంగా ఉన్నాడు. దీంతో అతని స్థానంలో మరో జట్టు ప్లేయర్​ డేవిడ్​ వార్నర్​ను నియమించారు. అయితే గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరమైన పంత్‌ను మ్యాచ్‌లు చూసేందుకు డగౌట్‌కు తీసుకొస్తామని దిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ నేపథ్యంలో లఖ్‌నవూతో తొలి మ్యాచ్​ ఆడిన సమయంలో పంత్​ జెర్సీ నం.17ను డగౌట్‌లో ప్రదర్శించింది టీమ్​ మేనేజ్​మెంట్​. అయితే ఈ విషయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

జట్టు సభ్యులను ఉత్సాహపరచడం సహా పంత్‌ తమతోనే ఉన్నాడని చెప్పేందుకు తొలి మ్యాచ్‌ సందర్భంగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీశారు. దిల్లీ ఫ్రాంచైజీ చేసిన ఈ పనిపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 'ఇది చాలా తీవ్రమైన చర్య. ఇలాంటివి అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్‌ సమయంలోనే చేస్తారు. ఇక్కడ పంత్‌ బాగున్నాడు. అందరూ ఊహించిన దానికంటే వేగంగానే కోలుకుంటున్నాడు. మంచి ఉద్దేశంతోనే వారు చేసినప్పటికీ.. భవిష్యత్‌లో ఇలాంటి వాటిని పునరావృతం చేయొద్దు' అని బీసీసీఐ సున్నితంగా చెప్పినట్లు ఐపీఎల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా పంత్‌ జెర్సీని ప్రదర్శించాలనే నిర్ణయం జట్టు హెడ్‌ కోచ్‌ పాంటింగ్‌దని తెలుస్తోంది.

మరోవైపు దిల్లీ ఆడే రెండో మ్యాచ్‌కు పంత్‌నే స్వయంగా డగౌట్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. హోమ్‌ గ్రౌండ్‌లో గుజరాత్‌తో జరిగే ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు పంత్​ మైదానంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీసీసీఐ భద్రతా, అవినీతి నిరోధక విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. 'దిల్లీ జట్టులో పంత్‌ ఎప్పుడూ భాగమే. మంగళవారం గుజరాత్‌తో మ్యాచ్‌ను అతడు డగౌట్‌ నుంచి వీక్షించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అనుమతిస్తే అతడు డగౌట్‌లో భాగమవుతాడు' అని ఐపీఎల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇటీవలే ఓ ప్రమోషనల్​ వీడియోలో సైతం రిషభ్​ పంత్​ మెరిశాడు. ఆ వీడియోలో మాట్లాడిన పంత్​ త్వరలో తాను గేమ్​కు వస్తున్నట్లు తెలిపాడు. ''క్రికెట్‌, ఫుడ్‌.. ఈ రెండింటిని వదిలి నేను ఉండలేను. యాక్సిడెంట్‌ కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్​కు దూరమయ్యాను. ఇష్టమైన ఫుడ్​ను కూడా తినలేకపోయాను. అయితే కాస్త కోలుకున్నాకా డాక్టర్‌ మంచి ఫుడ్​ తీసుకుంటే త్వరగా రికవరీ అవుతావని అన్నారు. అందుకే ఆరోగ్యానికి మంచిదైన ఇంటి ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నా. ఇక త్వరలో క్రికెట్‌ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎందుకు క్రికెట్‌ ఆడకూడదు అనిపించింది. అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. ఇంకా గేమ్‌లోనే ఉన్నా.. మ్యాచ్‌లు ఆడడానికి వస్తున్నా అంటూ పేర్కొన్నాడు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అది ప్రమోషనల్​ వీడియో అని తెలియడంతో నిరశ చెందారు. తమ స్టార్​ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెట్టారు.

Last Updated :Apr 4, 2023, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.