'ట్రోలింగ్ ఆటగాళ్లను దెబ్బతీస్తోంది.. తిట్టడమే వారి హక్కు అన్నట్లు చేస్తున్నారు'

author img

By

Published : May 17, 2023, 8:30 PM IST

KL Rahul

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేయటం అలవాటుగా మారిపోయింది. ఆ ట్రోలింగ్ హద్దులు మీరనంత వరకైతే ఓకే. కానీ ట్రోలింగ్ మితిమీరిపోతే మనోభావాలు దెబ్బతీనే అవకాశం ఉంటుంది. తాజాగా టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇదే జరిగింది! అసలు రాహుల్​ ఏం అన్నాడంటే?

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్, లఖ్​నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ పట్ల స్పందించాడు. క్రీడాకారులపై ట్రోలింగ్ చేయడం అనేది విచారకరం అని అన్నాడు. అది ఆటగాళ్ల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని రాహుల్ అన్నాడు. ఇటీవల కాలంలో తాను ట్రోలింగ్స్​ను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాహుల్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. నిలకడ లేని బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరిచాడు. దీంతో అతడిపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ త్వరగా పెవిలియన్ చేరితేనే బెటర్ అంటూ కామెంట్లు చేశారు. రీసెంట్​గా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాహుల్‌ను వ్యాఖ్యాత ట్రోలింగ్‌పై ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

"హద్దులు మీరిన ట్రోలింగ్‌ వల్ల కొన్నిసార్లు బాధపడ్డాను. నాతో పాటు సహచర ఆటగాళ్లు కూడా ట్రోలింగ్ వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. అథ్లెట్స్‌గా మేము అభిమానుల నుంచి మద్దతు ఆశిస్తాం. కానీ కొందరు మాత్రం ఆటగాళ్ల ఫెయిల్యూర్స్​ను ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా దూషిస్తారు. అది వాళ్లకు ఉన్న హక్కుగా భావిస్తుంటారు. ప్రతీ ప్లేయర్ తమ నుంచి మంచి ప్రదర్శన చూపటానికే ప్రయత్నిస్తారు. క్రికెట్​ మా జీవితం. మాకు క్రికెట్​ తప్ప మరొక పని తెలీదు. నేను గ్రౌండ్​లో దిగినప్పుడు నా జట్టుకు వంద శాతం న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. అలాంటిది కొందరు నన్ను.. ఆట పట్ల అంకితభావంతో లేనని, నెట్స్​లో శ్రమించటం లేదని అంటారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా అలా ఎలా అంటారో నాకైతే తెలీదు. ఆటలో ఎంత కష్టపడినా కొన్నిసార్లు సరైన ఫలితం దక్కకపోవచ్చు. నాకు కూడా అలాంటి పరిస్థితులు చాలానే ఎదురయ్యాయి" అని రాహుల్ సమాధానమిచ్చాడు.

ఈ క్రమంలో ధోనీ గురించి అడగ్గా.. "నా మొదటి కెప్టెన్ ధోనీయే. అతడి కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా. మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీని చూసి అలవర్చుకున్నాను. ఒక పక్క జట్టును ముందుకు నడిపిస్తూనే.. సహచర ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకున్నాను. కోహ్లీ టీమ్ఇండియా కెప్టెన్​గా ఉన్నప్పుడు భారత్ తిరుగులేని ప్రదర్శన కనబర్చింది. ఇక ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్​ రోహిత్ శర్మ చాలా తెలివైనవాడు. రోహిత్ వ్యూహాలు అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. అతడికి ప్రతీ ఆటగాడి బలంతో పాటు బలహీనత తెలుసు. ఆటను చివరి వరకూ అర్థం చేసుకోగల సామర్థ్యం కలవాడు" అని రాహుల్ పేర్కొన్నాడు.

కాగా.. రాహుల్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగిన రాహుల్ డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యచ్​కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం తొడ కండరాలకు శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.