ETV Bharat / sports

టీమ్​ఇండియాకు చావోరేవో.. సిరీస్​పై సఫారీల కన్ను

author img

By

Published : Jun 13, 2022, 5:40 PM IST

IND VS SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమ్​ఇండియా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు సిద్ధమైంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో వైజాగ్‌ వేదికగా మంగళవారం జరిగే మూడో టీ20లో.. సఫారీలతో పంత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.

IND VS SA
మూడో టీ20

IND VS SA: వైజాగ్ వేదికగా.. కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటేందుకు పంత్ సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే.. స్పిన్నర్ల వైఫల్యానికి తోడు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ రిషబ్‌ పంత్ ఫామ్‌లో లేకపోవటం భారత్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

ఓపెనర్లు.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ పవర్‌ప్లేలో జట్టుకు శుభారంభాన్ని ఇవ్వటంలో విఫలమవుతున్నారు. ఇషాన్ రాణిస్తున్నప్పటికీ.. గైక్వాడ్ విఫలమవ్వటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. శ్రేయస్ అయ్యర్ ఫర్వాలేదనిపిస్తున్నా.. మంచి ఆరంభాలను పెద్దస్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఇదే సమయంలో తక్కువ స్ట్రైక్ రేట్ కారణంగా తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి పడుతోంది. అద్భుత ఫామ్‌తో గుజరాత్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సఫారీలతో సిరీస్‌లో ఆస్థాయిలో రాణించలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌లలో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 49 పరుగులు సమర్పించుకున్నాడు.

కెప్టెన్‌గా పంత్ తీసుకుంటున్న నిర్ణయాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో టీ20 మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌ను కాదని అక్షర్‌ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పంత్‌ ఫామ్‌ సైతం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 126 స్ట్రైక్ రేటుతో మూడు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. ఈ ఏడాదిలోనే.. టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో పంత్ రాణించాలని.. జట్టు కోరుకుంటోంది. బౌలింగ్ విభాగానికి వస్తే స్పిన్నర్లు తేలిపోవటం.. భారత్‌ ఓటమికి కారణమవుతోంది. రెండు మ్యాచ్‌లలో కలిపి ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన యజువేంద్ర చాహల్.. 75 పరుగులు సమర్పించుకున్నాడు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 59 పరుగులు.. ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో వీరిలో ఒకరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ లేదా పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు.. ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ తీయని ఆవేశ్ ఖాన్ స్థానంలో.. పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ లేదా అర్ష్‌దీప్‌లో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉంది.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న సఫారీలు.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో మిల్లర్, డుస్సెన్‌ సత్తా చాటితే.. రెండో మ్యాచ్‌లో క్లాసెన్ టీమ్​ఇండియా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. బౌలింగ్‌లో రబాడా, పార్నెల్, నోర్జే రాణిస్తుండటం దక్షిణాఫ్రికాకు సానుకూలంగా మారింది.

ఇదీ చూడండి: IND VS SA: 'అదే ఈ సిరీస్‌లో అతిపెద్ద సమస్య'

బీసీసీఐకి కాసుల పంట.. ఒక్క మ్యాచ్​కు రూ.107.5కోట్లు.. మీడియా హక్కులు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.