ETV Bharat / sports

కివీస్‌తో భారత్‌ రెండో టీ20.. నిలవాలంటే.. తప్పక గెలవాల్సిందే!

author img

By

Published : Jan 29, 2023, 7:56 AM IST

వన్డే సిరీస్​లో న్యూజిలాండ్​ను ఊపిరాడకుండా చేసిన భారత్​.. టీ20 సిరీస్​ మొదటి మ్యాచ్​లోనే చతికిల పడింది. దీంతో ఆదివారం కివీస్​తో జరగనున్న టీ20 రెండో మ్యాచ్ భారత్​కి అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్​పై ఆశలు నిలవాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. మరి ఎలాంటి వ్యూహాలతో అడుగేస్తుందో, వన్డే సిరీస్​ దూకుడు చూపిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

india newzealand t20i 2nd match sunday
నేడు కివీస్‌తో భారత్‌ రెండో టీ20

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేశాక, తొలి టీ20లో ఉత్సాహం తగ్గించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తలపడబోతోంది. కివీస్‌తో రెండో టీ20 ఆదివారం జరగనుంది. నువ్వా..నేనా అన్నట్లుగా ఆడే ఈ మ్యాచ్​లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే. వన్డే సిరీస్​లో ఘోరంగా పరాజయం పొందిన న్యూజిలాండ్ విజయ ఆకలితో పరుగులు పెడుతోంది. ముందు చూపుతో వ్యూహాలు పన్నితేనే భారత్​ విజయం సాధించగలదు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు రాంచిలో కివీస్‌ పెద్ద షాకే ఇచ్చింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింట్లోనూ టీమ్​ఇండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బౌలింగ్‌లో లభించిన మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేక ప్రత్యర్థితో 170 పైచిలుకు స్కోరు చేయించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో వెనకపడిపోయింది. టీమ్​లో స్థాయికి తగ్గ అద్భుత ప్రదర్శన ఏం జరగలేదు. సూర్యకుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కివీస్​కు గట్టి పోటీ ఇవ్వకుంటే భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది.

ఆ ముగ్గురిపై దృష్టి: టీ20ల్లో భారత్‌ నిలకడగానే విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం నిలకడగా లేదు. ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత సీనియర్లు రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ టీ20 జట్టుకు దూరంగా ఉండగా, వారి స్థానాల్లో ఆడుతున్న ఆటగాళ్లు మాత్రం అంత గొప్ప ప్రదర్శనను ఇవ్వలేకపోతున్నారు. ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి నిలకడ అందుకోలేకపోతున్నారు. త్రిపాఠి ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు కానీ.. మిగతా ఇద్దరికీ మ్యాచుల్లో ఆడటానికి బాగానే అవకాశాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీని మినహాయిస్తే ఇషాన్‌ ప్రదర్శన చాలా తక్కువ. కివీస్‌తో వన్డేల్లో వరుసగా 5, 8, 17 పరుగులే చేసిన అతను.. తొలి టీ20లో 4 పరుగులకే వెనుదిరిగాడు. దీపక్‌ హుడా కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాన్నాళ్లయింది.

వన్డే సిరీస్​లో సెంచరీలు బాదిన శుభ్‌మన్‌ గిల్‌ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. తన అద్భుతమైన ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో టీ20లో వీళ్లందరూ దూకుడు చూపించాల్సిందే. టీమిండియాకి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత ప్రదర్శన, నాయకత్వ వ్యూహాల విషయంలో మెప్పించలేకపోతున్నాడు. సిరీస్‌ ఫలితాన్ని నిర్దేశించే మ్యాచ్‌లో అతను అన్ని రకాలుగా సత్తా చాటాల్సిందే. వన్డేల్లో విఫలమైనా టీ20లకు వచ్చేసరికి సూర్యకుమార్‌ ఉత్సాహాన్ని ప్రదర్శించడం టీమిండియాకి కాస్త ఊరటనిచ్చే విషయమే. వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ చక్కటి ఫామ్‌ను కొనసాస్తుండగా.. పేసర్‌ అర్ష్‌దీప్‌ ఉన్నట్లుండి లయ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా నిలకడగా రాణించలేకపోతున్నాడు.

ఇక కివీస్‌ వన్డే సిరీస్‌లో ఘోరంగా పరాజయం పొందాక..విజయాకలితో వికెట్ల పరుగులు తీస్తోంది. సాధించాలనే కసితో ఉన్న కివీస్ తొలి టీ20లో సత్తా చాటింది. ఓపెనర్లు కాన్వే, అలెన్‌లతో పాటు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయగా.. బౌలర్లందరూ సమష్టిగా వారి సత్తా చాటారు. విజయోత్సాహంలో ఉన్న కివీస్‌ను సిరీస్‌ సాధించకుండా ఆపాలంటే భారత్‌ గట్టిగా పోరాడాల్సిందే. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న లఖ్‌నవూ స్టేడియం బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తుందని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.