ETV Bharat / sports

టీమ్​ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్​కు అప్పగిస్తున్నారా?

author img

By

Published : Dec 22, 2022, 2:35 PM IST

టీమ్​ఇండియా కొత్త కెప్టెన్​ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. హార్దిక్​ పాండ్యాను కొత్త సారథిగా ఎంపిక చేసే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

Hardik pandya T20 ODI captain
టీమ్​ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్​కు అప్పగిస్తున్నారా?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో మార్పులు చేయాలంటూ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా ఈ పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీలో మార్పులు చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను.. టీ20ల నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్‌ పాండ్యాకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో భారత నెక్స్ట్​ కెప్టెన్‌గా పాండ్యా బాధ్యతలు అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

"వన్డే , టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని మేం ప్రణాళికలు వేస్తున్నాం. పాండ్యాతో కూడా చర్చించాం. అయితే, దీనిపై స్పందించేందుకు తనకు కొంత సమయం కావాలని అతడు కోరాడు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆలోచనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా.. బుధవారం బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో టీ20/వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. "అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలో ఈ అంశం లేదు. దీనిపై చర్చ కూడా జరగలేదు. కెప్టెన్సీపై కేవలం సెలక్షన్‌ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది" అని ఆ అధికారి వెల్లడించారు.

ఇకపోతే ఐపీఎల్​లోను గుజరాత్‌ జట్టును అరంగేట్రంలోనే గెలిపించిన పాండ్యాకు.. పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలు అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని గత కొంతకాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, వన్డే ఫార్మాట్‌ పగ్గాలు అప్పగించాలంటే మాత్రం.. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ను మరింత పరిశీలించాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

హార్దిక్‌ సారథ్యంలోనే.. ప్రస్తుతం రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. ముంబయి వేదికగా జనవరి 3, 2023న తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. జనవరి 5న పుణెలో రెండో మ్యాచ్‌, 7న రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్‌ ఆడనున్నారు. కానీ, కెప్టెన్సీ వార్తలపై అధికారిక ప్రకటనేమీ లేదు. మరోవైపు టీ20ల నుంచి రోహిత్‌కు కొంతకాలం విరామం ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: Jayadev Unadkat: 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ.. వచ్చీ రాగానే సూపర్​ రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.