ETV Bharat / sports

Ashes 2021 Records: ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. రికార్డులే రికార్డులు!

author img

By

Published : Dec 28, 2021, 5:35 PM IST

Ashes 2021 Records: యాషెస్ సిరీస్​ మూడో టెస్టులో ఘోర పరాజయం పాలైంది ఇంగ్లాండ్. తద్వారా సిరీస్​ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Ashes 2021 records, Australia vs England 3rd Test records, యాషెస్ 2021 రికార్డులు, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ రికార్డులు
Ashes 2021

Ashes 2021 Records: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ పూర్తయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 68కే ఆలౌట్‌ చేసి.. ఇన్నింగ్స్‌ 14 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది కంగారూ జట్టు. 31/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ జో రూట్‌ (28), బెన్‌స్టోక్స్‌ (11) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ 6/7 సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 267 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

  • ఈ మ్యాచ్​లో నాలుగు వికెట్లతో రాణించిన ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ ఆస్ట్రేలియాపై 150 వికెట్లు దక్కించుకున్న ఆరో బౌలర్​గా రికార్డు నెలకొల్పాడు. కర్ట్​లీ ఆంబ్రోస్ (189), ఇయాన్ బోథమ్ (183), రిచర్డ్ హడ్లీ (176), కోర్ట్​నీ వాల్ష్ (165), స్టువర్ట్ బ్రాడ్ (156) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
  • టెస్టు అరంగేట్రంలోనే అదరగొట్టాడు ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బొలాండ్. కేవలం 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు దక్కించుకున్నాడు. వికెట్ల పరంగా అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా తరఫున ఓ ఇన్నింగ్స్​లో ఇది ఐదో అత్యుత్తమ ప్రదర్శన. అల్బర్ట్ ట్రాట్ (8/43), బాబ్ మస్సే (8/53), జాసన్ క్రెజా (8/215), టామ్ కెండల్ (7/55) బొలాండ్ కంటే ముందున్నారు.
  • ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​ను 8వ సారి పెవిలియన్ పంపాడు ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్. ఈ క్రమంలోనే స్మిత్​ను ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ సరసన అగ్రస్థానంలో నిలిచాడు. యాసిర్ షా (7), రవి అశ్విన్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • ఈ మ్యాచ్​లో 7 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు ఆసీస్ పేసర్ స్కాట్ బొలాండ్. ఈ క్రమంలోనే అరంగేట్ర మ్యాచ్​లోనే ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఆసీస్ క్రికెటర్​గా రికార్డు నెలకొల్పాడు.
  • ఈ మ్యాచ్​లో పరాజయంతో ఈ ఏడాదిలో తొమ్మిది టెస్టుల్లో ఓటమి చవిచూసినట్లైంది ఇంగ్లాండ్. ఓ క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక టెస్టుల్లో ఓటమిపాలైన జట్ల జాబితాలో బంగ్లాదేశ్ (9) సరసన అగ్రస్థానంలో కొనసాగుతోంది.
  • ఆసీస్ పేసర్ బొలాండ్ ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత తక్కువ బంతుల్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో ఎర్నీ టొషాక్, స్టువర్ట్ బ్రాడ్​తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
  • ఈ టెస్టు ద్వారా టెస్టుల్లో ఈ ఏడాది 1708 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. తద్వారా ఓ క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. గ్రేమ్ స్మిత్ (1656), మైఖేల్ క్లర్క్ (1595) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • అలాగే ఓ క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక టెస్టు పరుగులు (1708) చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు రూట్. పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ (1788), విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (1710) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇవీ చూడండి: ఇంత దారుణంగా ఓడిపోవడం బాధ కలిగించింది: రూట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.