ETV Bharat / science-and-technology

జూన్‌లో జాబిల్లిపైకి ఇస్రో చంద్రయాన్‌-3.. 2024 చివర్లో గగన్‌యాన్‌

author img

By

Published : Oct 21, 2022, 6:44 AM IST

జాబిల్లిపై పరిశోధనల కోసం ఇస్రో తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు.

ISRO Chandrayaan 3
ISRO Chandrayaan 3

ISRO Chandrayaan 3: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది! వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దానిద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌'ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు.. ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. యాత్ర మధ్యలో వ్యోమగాములకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి చేర్చే సామర్థ్యాలను సముపార్జించుకోనున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా తొలి 'అబార్ట్‌ మిషన్‌'ను 2023 తొలినాళ్లలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో గురువారం విలేకర్లతో మాట్లాడిన సోమ్‌నాథ్‌ ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు. ల్యాండింగ్‌ ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో.. 2019 సెప్టెంబరులో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.

"లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌-3 (ఎల్‌వీఎం3) ద్వారా చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని 2023 జూన్‌లో చేపడతాం. ఇది చంద్రయాన్‌-2కు ప్రతిరూపమేమీ కాదు. ఇంజినీరింగ్‌ పరంగా చంద్రయాన్‌-3 చాలా భిన్నమైనది. గతంతో పోలిస్తే అనేక మార్పులు చేశాం. జాబిల్లి ఉపరితలాన్ని తాకే కాళ్ల వంటి భాగాలను బలంగా రూపొందించాం. ఒకవేళ ఏదైనా వ్యవస్థ విఫలమైతే.. దాని బాధ్యతను మరొకటి తీసుకునేలా తీర్చిదిద్దాం" అని సోమ్‌నాథ్‌ తెలిపారు. మరోవైపు- గగన్‌యాన్‌ సన్నాహాల్లో భాగంగా.. ధ్వని వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఒకసారి, ధ్వని కంటే రెట్టింపు వేగంతో వెళ్తున్నప్పుడు మరోసారి అబార్ట్‌ మిషన్లు చేపడతామని ఇస్రో ఛైర్మన్‌ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.