ETV Bharat / science-and-technology

బ్యాంకింగ్, బ్లూటూత్‌ సేవలంటూ నయా మోసం.. యాప్​లను​ తొలగించిన గూగుల్!

author img

By

Published : Nov 6, 2022, 8:50 AM IST

google-removes apps
యాప్‌లను తొలగించిన గూగుల్

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్లేస్టోర్‌లోకి ఎన్నో రకాల కొత్త యాప్‌లు వస్తున్నాయి. వీటిలో కొన్ని యూజర్‌కు మెరుగైన సేవలను అందిస్తే.. మరికొన్ని డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయి. అటువంటి మోసపూరిత యాప్స్​ను ప్లేస్టోర్​ ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంటుంది. అయితే.. బ్యాంకింగ్​ రంగానికి చెందిన కొన్ని యాప్​లను ప్లేస్టోర్​ నుంచి తొలగించింది.

షాపింగ్, బ్యాకింగ్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి మొబైల్ హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ వరకు ఎన్నో యాప్‌లు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నియాప్‌లు యూజర్‌ డేటాను చోరీ చేస్తున్నాయి. అలాంటి కొన్ని యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. తాజాగా, బ్యాంకింగ్‌ సేవల ముసుగులో యూజర్‌ డేటాను సేకరించడంతోపాటు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సైబర్‌ ముఠాలకు అందిస్తున్న యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. వీటితోపాటు మాల్‌వేర్‌ వ్యాప్తిచేస్తున్న నాలుగు బ్లూటూత్‌ యాప్‌లను కూడా తొలగించింది. యూజర్లు కూడా తమ డివైజ్‌ల నుంచి వాటిని డిలీట్‌ చేయమని సూచించింది.

మై ఫైనాన్స్‌ ట్రాకర్‌ (My Finances Tracker: Budget), జెట్టర్‌ అథెంటికేటర్‌ (Zetter Authenticator), రికవర్‌ ఆడియో, ఇమేజెస్‌ అండ్‌ వీడియో (Recover Audio, Images & Videos) అనే యాప్‌లు స్క్రీన్‌ రికార్డింగ్ మాల్‌వేర్ సాయంతో యూజర్‌ బ్యాంకింగ్‌ వివరాలను సేకరిస్తున్నాయని థ్రెట్‌ ఫ్యాబ్రిక్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. వీటితోపాటు బ్లూటూత్‌ ఆటో కనెక్ట్ (Bluetooth Auto Connect), డ్రైవర్‌ (Driver: Bluetooth, Wi-Fi, USB), బ్లూటూత్‌ యాప్‌ సెండర్‌ (Bluetooth App Sender), మొబైల్‌ ట్రాన్స్‌ఫర్‌ (Mobile Transfer: Smart Switch) యాప్‌లు ట్రోజన్‌ యాడ్‌ మాల్‌వేర్‌ను యూజర్‌ మొబైల్స్‌లోకి పంపుతున్నాయని మాల్‌వేర్‌బైట్స్‌ ల్యాబ్స్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తన పరిశోధనలో కనుగొంది.

యూజర్‌కు ఎలాంటి అనుమానం రాకుండా డౌన్‌లోడ్‌ చేసిన 72 గంటల తర్వాత ఈ యాప్‌లు మాల్‌వేర్‌ను వ్యాప్తిచేస్తున్నాయని తెలిపింది. ఇవి యూజర్‌ ప్రమేయం లేకుండా, మొబైల్‌ లాక్‌ మోడ్‌లో ఉన్నా.. క్రోమ్‌ బ్రౌజర్‌లో అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయడం, మాల్‌వేర్‌ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్‌లపై క్లిక్ చేస్తున్నట్లు మాల్‌వేర్‌బైట్స్‌ ల్యాబ్స్‌ తెలిపింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను ఫోన్ల నుంచి డిలీట్ చేయమని సూచించింది. కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసే ముందు రేటింగ్‌, యూజర్‌ రివ్యూలతోపాటు.. వాటికి ప్లేస్టోర్ ప్రొటెక్ట్‌ సర్టిఫైడ్‌ ఉందా? లేదా? అనేది తప్పక చెక్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.