ETV Bharat / science-and-technology

Chandrayaan 3 launch date : 'చంద్రయాన్‌-3 ప్రయోగం అప్పుడే.. ఈసారి భారీ మార్పులతో'

author img

By

Published : Jun 13, 2023, 11:18 AM IST

Updated : Jun 13, 2023, 12:31 PM IST

Chandrayaan 3 launch date : చంద్రయాన్‌-3 ప్రయోగంపై కీలక విషయాలు వెల్లడించారు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌. అన్ని సాఫీగా జరిగితే జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపడతామని ఆయన వివరించారు. ప్రయోగంలో కీలక మార్పులు చేసినట్లు కూడా సోమనాథ్‌ పేర్కొన్నారు.

isro chandrayaan 3 launch date
ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగ తేదీ

Chandrayaan 3 launch date : నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపడతామని.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఆ తర్వాత కూడా ప్రయోగాన్ని చేపట్టవచ్చని.. అయితే ఇందుకు ఇంధనాన్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 వ్యోమనౌక శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రానికి చేరుకుందని.. సోమనాథ్‌ పేర్కొన్నారు.

చంద్రయాన్‌ 3 ప్రయోగం తుది ఏర్పాట్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని ఇస్రో ఛైర్మన్‌ వివరించారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి LVM-3ని ఉపయోగిస్తామని, దాని కూర్పు పని సాగుతోందని.. అందుకు సంబంధించిన భాగాలన్నీ శ్రీహరికోట చేరుకున్నాయని సోమనాథ్‌ తెలిపారు. రాకెట్‌ కూర్పు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్న సోమనాథ్‌.. ఆ తర్వాత చంద్రయాన్‌-3ని రాకెట్‌తో అనుసంధానిస్తామని తెలిపారు. ప్రయోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వ్యోమనౌకలో అనేక మార్పులు చేశామన్న ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపెట్టేలా పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చినట్లు ఆయన వివరించారు.

అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తరువాతే.. చంద్రయాన్-3ని ప్రయోగిస్తామని సోమ్​నాథ్​ వివరించారు. చంద్రయాన్​-3ని ప్రయోగించే సమయంలో తలెత్తే సమస్యలను నిరోధించేందుకు.. హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్ సెన్సార్లలో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాకెట్​ ఇందన సామర్థ్యాన్ని పెంచినట్లు ఆయన వివరించారు. ​కిందకు దిగే ల్యాండర్ కాళ్లను బలోపితం చేసినట్లు సోమ్​నాథ్​ పేర్కొన్నారు. ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేందుకు రాకెట్​కు పెద్ద సోలార్​ ప్యానళ్లను అమర్చినట్లు ఆయన వెల్లడించారు. అదనంగా మరో సెన్సార్​ను కూడా జతచేసినట్లు తెలిపారు.

"చంద్రయాన్ వేగాన్ని కొలిచేందుకు.. గత సంవత్సరం అభివృద్ధి చేసిన 'లేజర్ డాప్లర్ వెలోసిమీటర్'ను దానికి అమర్చాం. చంద్రయాన్​ అల్గారిథమ్‌ను కూడా మార్చాం. కొత్త సాఫ్ట్​వేర్​ను జతచేశాం. అనుకున్న ప్రదేశంలో చంద్రయాన్​ ల్యాండ్​ కాకపోతే.. వేరే ప్రదేశంలో ల్యాండ్​ అయ్యేందుకు ఇవి సహాయపడతాయి" అని ఇస్రో ఛైర్మన్​ తెలిపారు.

చంద్రయాన్-3లో బలమైన రోవర్‌ను.. 2024లో గగన్‌యాన్‌..
కొంతకాలం క్రితం కూడా చంద్రయాన్-3పై ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమ్‌నాథ్‌ కీలక విషయాలు తెలిపారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. అధే విధంగా భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌'ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎస్‌.సోమ్‌నాథ్‌ వివరించారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు.. ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. యాత్ర మధ్యలో వ్యోమగాములకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి చేర్చే సామర్థ్యాలను సముపార్జించుకోనున్నట్లు ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

Last Updated : Jun 13, 2023, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.